కరోనా(కోవిడ్-19) వైరస్ వ్యాపిస్తున్నా ఆస్ట్రేలియా గ్రాండ్ ప్రి యథావిథిగా కొనసాగించడంపై.. ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్ లూయిస్ హామిల్టన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఆదివారం నుంచి ప్రారంభంకానున్న మెగా రేసులో పాల్గొనేందుకు హామిల్టన్ ఆల్బర్ట్ పార్క్ చేరుకున్నాడు. ఈ సందర్భంగా గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కరోనా పట్ల తన అభిప్రాయాలను వెల్లడించాడు. ఆస్ట్రేలియా గ్రాండ్ ప్రి నిర్వహించడం ఆనందంగా ఉన్నా ఒకే గదిలో ఇంత మంది ఉండటం ఆశ్చర్యం కలిగించిందని చెప్పాడు. ఈ రేసులను చూడడానికి చాలా మంది ప్రేక్షకులు వస్తున్నారని, దీన్ని బట్టి ప్రజలు కాస్త నిదానంగా అప్రమత్తం అవుతున్నట్లు అనిపిస్తోందన్నాడు.
![Racer Lewis Hamilton](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6388434_hamilton2020.jpg)
డబ్బే ముఖ్యమా..!
తాను ప్రజల ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతున్నానని, మరీ ముఖ్యంగా పెద్దవాళ్ల గురించి ఆలోచిస్తున్నానన్నాడు. అలాగే ఫార్ములా వన్ పోటీలను చూసేందుకు ఎక్కువ మంది వస్తారని చెప్పాడు. ఇదిలా ఉండగా హాస్, మెక్‌లారెన్ జట్లలోని సిబ్బందికి కరోనా పరీక్షలు జరిగాయని హామిల్టన్ అన్నాడు. కాగా, ఆ పరీక్షల ఫలితాలు ఆలస్యం కావచ్చని, తద్వారా నిర్వాహకులు రేసును కొనసాగించేలా చూస్తున్నారని పేర్కొన్నాడు. 'డబ్బు రాజుతో సమానమని' తన వ్యాఖ్యల పట్ల సిగ్గుపడడం లేదన్నాడు. ఈ సందర్భంగా 'ఎఫ్ వన్' అభిమానులు వ్యక్తిగత శుభ్రత పాటించాలని కోరాడు. మరోవైపు గురువారం ప్రారంభమైన ప్రాక్టీస్ రేసులను చూడడానికి ప్రేక్షకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
![Racer Lewis Hamilton](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6388434_hamilton1818.jpg)
ఇదిలా ఉండగా ఏప్రిల్‌లో చైనీస్ గ్రాండ్ ప్రి నిర్వహించాల్సి ఉండగా ఇప్పటికే ఆ ఈవెంట్‌ను వాయిదా వేశారు. మరోవైపు మార్చి 22న జరగాల్సిన బహ్రెయిన్ రేసును ప్రేక్షకులు లేకుండా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక వచ్చేనెల వియత్నాంలో నిర్వహించాల్సిన రేసుపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.