Gopichand PV Sindhu : ఒలింపిక్ పతక విజేత, స్టార్ షట్లర్ పీవీ సింధు గత కొంతకాలంగా వరుస టోర్నీల్లో విఫలమవుతోంది. ఇటీవలే జరిగిన మలేసియా మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలోనూ నిరాశపరిచింది. తొలుత అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్లినప్పటికీ.. మే 27న జరిగిన మ్యాచ్‌లో ఇండోనేసియాకు చెందిన జార్జియా మరిస్కా టున్ జుంగ్ చేతిలో ఓటమిని చవిచూసింది. దీంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.
అయితే సింధు ఫామ్ లేమి పట్ల ఆమె ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్.. సింధు గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆమె విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. "ఆమె వయసులో చాలా చిన్నది. వయసు కూడా 26-27 మధ్య ఉంటుంది. ఫామ్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కేవలం ఆరు ఎనిమిది నెలల్లోనే ఆమె టాప్ పొజిషన్‌కు వచ్చింది. భవిష్యత్తులో ఆమె బాగా ఆడుతుందని నేను ఆశిస్తున్నాను. ఇది సీజన్ ఆరంభం. ఇక ఒలింపిక్స్ కోసం అర్హత సాధించేందుకు సరైన సమయం. ఇప్పటి వరకు వచ్చిన ఆమె ఫలితాలన్నీ మిశ్రమంగానే ఉన్నాయి" అని గోపీచంద్ అన్నాడు.
అందుకే గోపీచంద్ అకాడమీ నుంచి బయటకొచ్చా: సింధు
అయితే ఒలింపిక్స్ ముందు వరకు కోచ్ పుల్లెల గోపీచంద్ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్న స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు.. అనూహ్యంగా ఆ ప్రతిష్ఠాత్మక క్రీడల ముందే అకాడమీ నుంచి వైదొలిగింది. దీంతో వారిద్దరి మధ్య ఏదైనా విభేదాలు తలెత్తయా అంటూ అందరిలో అనుమానాలు తలెత్తాయి. ఈ క్రమంలో ఆమె కొన్నిరోజుల క్రితం ఈటీవీలో ప్రసారమైన అలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఈ విషయంపై మాట్లాడింది. గోపీచంద్ అకాడమీలో కొన్ని విషయాలు తనకు నచ్చకపోవడం వల్లే బయటకు వచ్చేసినట్లు, అభిప్రాయభేదాలు వచ్చినట్లు చెప్పుకొచ్చింది.
"ఆయనతో కొన్ని సంవత్సరాల పాటు ప్రయాణం చేశాను. ఆ తర్వాత మా మధ్య కొన్ని అభిప్రాయబేధాలు వచ్చాయి. నాకు కొన్ని విషయాలు నచ్చలేదు. నా ఆటపై ఎటువంటి ప్రభావం పడకూడదనే ఉద్దేశంతో.. కేవలం నా ఆటపై మాత్రమే పూర్తిగా దృష్టి సారించాలని అకాడమీ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. అక్కడ కొన్ని విషయాలు కూడా నచ్చలేదు. అలానే బయటకు వచ్చి నిరూపించాను. అక్కడ ఉన్నప్పుడు కూడా వివిధ కోచ్‌ల శిక్షణలో ఆడాను. ఓ ప్లేయర్ ఆడేటప్పుడు ఎటువంటి వివాదాలు ఉండకూడదు. ఎందుకంటే అవన్ని తన ఆటపై ప్రభావం చూపుతుంది. దాని వల్ల సరిగ్గా ఆడలేం. ఒలింపిక్స్ అనేది ప్రతి ప్లేయర్ కల. అలాంటప్పుడు నేను ఇలాంటి వాటిపై ఫోకస్ పెడితే నా ఆట దెబ్బతినొచ్చు. అందుకే నాకు ఏది మంచో అని ఆలోచించి, అక్కడి నుంచి బయటకు వచ్చాను" అని పేర్కొంది. ప్రస్తుతం సింధు.. విధి చౌదరీ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతోంది.