Fifa World Cup 2022 : ఫిఫా ప్రపంచకప్ రౌండ్-16లో భాగంగా జరిగిన నాకౌట్ మ్యాచ్‌లో గోల్స్ వర్షం కురిసింది. ఈ మ్యాచ్‌లో పోర్చుగల్ ఆటగాళ్లు 6 గోల్స్‌తో ప్రత్యర్థి స్విట్జర్లాండ్‌ను హడలెత్తించారు. ఈ మ్యాచ్‌కు ఓ విశేషం ఉంది. 2022 ప్రపంచకప్‌లో తొలిసారి హ్యాట్రిక్ గోల్స్ నమోదయ్యాయి. పోర్చుగల్‌కు చెందిన 21 ఏళ్ల ఆటగాడు గోంకాలో రామోస్ 17, 51, 67 నిమిషాల్లో గోల్స్ చేశాడు. అతడికి ఇదే తొలి ప్రపంచకప్ కావడం విశేషం.
ఈ మ్యాచ్‌లో స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో (సీఆర్7) బెంచ్‌కు మాత్రమే పరిమితమయ్యాడు. రొనాల్డో లేని లోటును రామోస్ పోర్చుగల్ జట్టుకు కనిపించనీయలేదు. వాస్తవానికి రామోస్ ప్రపంచకప్ ఆడటం ఇదే తొలిసారి. ఈ టోర్నీలో నాలుగు మ్యాచ్‌లు ఆడి.. 3 గోల్స్ చేశాడు. ఆ మూడు గోల్స్ ఈ స్విట్జర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనే నమోదయ్యాయి. ఈ మ్యాచ్‌లో రొనాల్డోను బెంచ్‌కే పరిమితం చేయడంపై కోచ్ సాంటోస్ స్పందించారు.
కేవలం వ్యూహాత్మక కారణాలతోనే సీఆర్7ను బెంచ్‌కు పరిమితం చేశామని.. అంతకు మించి ఏమీలేదని వివరణ ఇచ్చారు. దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్‌లో రొనాల్డో ప్రవర్తన కారణంగా పక్కనపెట్టినట్లు వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. అది ముగిసిన అధ్యాయం అని పేర్కొన్నారు. రొనాల్డో ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడని అభివర్ణించారు. తాము జట్టుగా సమష్టిగా ఆలోచిస్తామని పేర్కొన్నారు.
హ్యాట్రిక్ రికార్డులు ఇవి..
- 1930లో ఉరుగ్వేలో మొదలైన ప్రపంచ కప్ నుంచి నేటి ప్రపంచకప్ వరకు మొత్తం 53 హ్యాట్రిక్ గోల్స్ నమోదయ్యాయి.
- ఒక మ్యాచ్‌లో అత్యధికంగా రష్యా ఆటగాడు ఒలేగ్ సాలెంకో కామెరూన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 5 గోల్స్ సాధించాడు.
- 2018 ప్రపంచకప్‌లో పోర్చుగల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో స్పెయిన్‌పై హ్యాట్రిక్ గోల్స్ సాధించాడు. కాకపోతే ఆ మ్యాచ్ డ్రా అయింది. ప్రపంచకప్ చరిత్రలో హ్యాట్రిక్ గోల్స్ చేసినా డ్రా అయిన మ్యాచ్‌గా అది రికార్డు సృష్టించింది. అదే టోర్నీలో ఇంగ్లాండ్ ఆటగాడు హారీ కేన్ పనామా జట్టుపై హ్యాట్రిక్ సాధించాడు.
- ఇప్పటి వరకు ఈ టోర్నీ చరిత్రలో నలుగురు ఆటగాళ్లు మాత్రమే రెండుసార్లు హ్యాట్రిక్ సాధించారు. సాండర్ కోసిస్ (1954), జస్ట్ ఫొంటెయిన్ (1958), గెర్డ్ ముల్లర్ (1970), గాబ్రియల్ బటిస్టుటా (1994, 1998) హ్యాట్రిక్ గోల్స్ చేశారు.
- ప్రపంచకప్‌లలో పోర్చుగల్ జట్టు తరఫున చేసిన నాలుగో హ్యాట్రిక్ ఇది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">