అమ్మాయితో సహజీవనం చేస్తున్నానని ప్రకటించిన తర్వాత తనతో పాటు తన భాగస్వామిని ప్రజలు అదోలా చూడడం మొదలెట్టారని భారత అగ్రశ్రేణి స్ప్రింటర్ ద్యుతి చంద్ తెలిపింది. తమ వైపుగా తేడాగా చూసే వాళ్ల గురించి పట్టించుకోవాల్సిన అవసరం తనకు లేదని చెప్పింది. తాను స్వలింగ సంపర్కురాలినని గతేడాది ద్యుతి ప్రకటించింది.
"ఒకరు ఎవరితోనైనా, ఎప్పుడైనా ప్రేమలో పడొచ్చు. కులం, మతం లేదా లింగం ఆధారంగా దాన్ని నిర్ణయించలేరు. నా భాగస్వామి నాకెప్పుడూ మద్దతుగానే నిలిచింది. అందుకే నా జీవితంలో ఆమె ఉండాలని కోరుకున్నా. ప్రజలు మా వైపు తేడాగా చూడొచ్చు లేదా మమ్మల్ని గే, లెస్బియన్ అంటూ పిలవొచ్చు. కానీ మేం ఒకటిగా బతికినన్ని రోజులు వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రేమలో ఉండి బయటి ప్రపంచానికి భయపడే వాళ్లు ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే మంచి విషయాలను అంగీకరించేందుకు లోకం ఎప్పుడూ సమయం తీసుకుంటుంది. కాబట్టి భయపడకూడదు. అది మీ జీవితం, మీ ఆనందం" అని ద్యుతి చెప్పుకొచ్చింది.