ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే)పై భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ సంచలన విజయం సాధించాడు. సెయింట్ లూయిస్ ర్యాపిడ్, బ్లిట్జ్ ఆన్‌లైన్ చెస్ టోర్నీలో తొలి అంచె బ్లిట్జ్ పోటీల మూడో రౌండ్లో తెల్లపావులతో ఆడిన అతను 63 ఎత్తుల్లో ప్రపంచ నంబర్‌వన్ ఆటగాడు కార్ల్‌సన్‌ను ఓడించాడు. అయితే మిగతా రౌండ్లలో అతని ప్రదర్శన నిరాశపరిచింది. కార్ల్‌సన్‌తో పాటు జెఫ్రీ (అమెరికా)పై మాత్రమే గెలిచిన అతను.. నాలుగు రౌండ్లలో ఓడడం సహా మరో మూడు గేమ్‌లను డ్రా గా ముగించాడు.
లీనియర్, వెస్లీ (అమెరికా), అలెగ్జాండర్ (రష్యా), అలీ రెజా (ఇరాన్) చేతుల్లో అతను పరాజయం పాలయ్యాడు. మొత్తంగా తొలి అంచె బ్లిట్జ్ తొమ్మిది రౌండ్లు పూర్తయ్యేసరికి 3.5 పాయింట్లు సాధించిన అతను మొత్తంమీద 12.5 పాయింట్లతో అరోనియన్ (అర్మేనియా)తో కలిసి సంయుక్తంగా ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. కార్ల్‌సన్ 18.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.
పది మంది అగ్రశ్రేణి ఆటగాళ్లు తలపడుతున్న ఈ ఆన్‌లైన్ టోర్నీలో భాగంగా ర్యాపిడ్ విభాగంలో తొమ్మిది గేమ్‌లు, బ్లిట్జ్ తొలి, రెండు అంచెల్లో కలిపి 18 గేమ్‌లు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ర్యాపిడ్, బ్లిట్జ్ తొలి అంచె పోటీలు ముగిశాయి. ఇక రెండో అంచె బ్లిట్జ్ గేమ్‌లు మాత్రమే మిగిలాయి.