Novak Djokovic Australian Open: సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి నిష్క్రమించాడు. ఆస్ట్రేలియా ప్రభుత్వం రెండో సారి అతడి వీసాను రద్దు చేసిన నేపథ్యంలో కోర్టును ఆశ్రయించిన జకోవిచ్‌కు చుక్కెదురైంది. టెన్నిస్ స్టార్ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ఆస్ట్రేలియా ఫెడరల్ కోర్టు ఛీఫ్ జస్టిస్ జేమ్స్ అల్సోప్ తెలిపారు. జకోవిచ్ తమ దేశాన్ని వదిలివెళ్లాలని తీర్పు ఇచ్చారు. కోర్టు వాదనలకోసం అయిన ఖర్చు కూడా అతడు ప్రభుత్వానికి చెల్లించాలని ఆదేశించారు.
కోర్టు నిర్ణయం అనంతరం నొవాక్ జకోవిచ్ స్పందించాడు. "తీవ్ర నిరాశకు గురయ్యా. కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తా. ఆస్ట్రేలియా నుంచి తిరిగి వెళ్లడానికి అధికారులు చేస్తున్న ఏర్పాట్లకు సహకరిస్తాను." అని జకోవిచ్ అన్నాడు. కాగా, రెండోసారి వీసా రద్దయిన కారణంగా మూడేళ్ల పాటు అతడు ఆస్ట్రేలియాలో అడుగుపెట్టడానికి లేదు. 2025 వరకు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అతడు ప్రాతినిధ్యం వహించలేడు.
అసలేం జరిగిందంటే..
Djokovic Visa: తొలుత.. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనేందుకు మెల్‌బోర్న్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాడు జకోవిచ్. సరైన వీసా అనుమతులు, వైద్యపరమైన మినహాయింపులున్నా.. వాక్సినేషన్‌కు సంబంధించిన ధ్రువపత్రాలు లేని కారణంగా ఆస్ట్రేలియా బోర్డర్ ఫోర్స్ అధికారులు అతడిని అడ్డుకున్నారు. జకోవిచ్ వీసాను రద్దు చేసి డిటెన్షన్ సెంటర్‌లో ఉంచారు. ఈ విషయం పెద్ద చర్చనీయాంశంగా మారగా.. అక్కడే ఉన్న జకోవిచ్ ఆస్ట్రేలియా తీరుపై న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించాడు. ఈ క్రమంలోనే తన లాయర్ల ద్వారా వాదనలు వినిపించాడు జకోవిచ్. దీనిపై తీర్పు వెలువరించింది ఫెడరల్ కోర్టు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఇతడి వీసాను వాక్సినేషన్‌కు సంబంధించిన ధ్రువపత్రాలు లేని కారణంగా ఆస్ట్రేలియా బోర్డర్ ఫోర్స్ అధికారులు రద్దు చేయడాన్ని తప్పుబట్టింది. వెంటనే అతడిని మెల్‌బోర్న్ క్వారంటైన్ నుంచి విడుదల చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
కొద్ది రోజుల తర్వాత మరోసారి జకోవిచ్ వీసాను రద్దు చేశారు ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేషన్ మినిస్టర్ అలెక్స్ హాకే. అనంతరం అతడిని మరోసారి డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో మరోసారి కోర్టును ఆశ్రయించిన జకోవిచ్‌పై కీలక ఆదేశాలు జారీచేసింది ఫెడరల్ కోర్టు.
ఇదీ చదవండి:
Djokovic Australian Open: జకోవిచ్ ఆస్ట్రేలియా వీసా మరోసారి రద్దు