వచ్చే ఏడాది జరగనున్న టోక్యో ఒలింపిక్స్‌కు ఇప్పటివరకు అర్హత సాధించకపోవడంపై స్పందించింది భారత స్ప్రింటర్ హిమదాస్. అందుకు తనకేమీ బాధగా లేదని తెలిపింది. ఈ విశ్వక్రీడలు జరగడానికి ఇంకా ఏడాది సమయం ఉందని.. ఈలోగా అర్హత సాధించడానికి తనవంతు కృషి చేస్తానని వెల్లడించింది. ప్రస్తుతం విజృంభిస్తోన్న మహమ్మారి త్వరగా అంతమైపోవాలని ప్రతిఒక్కరూ ప్రార్థించాలని సూచించింది.
ఈ సారి 200మీటర్లలో
ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకం తెచ్చిన తొలి మహిళా అథ్లెట్‌గా పేరు సంపాదించింది హిమదాస్. 400మీటర్ల రేసులో బరిలో దిగి 50.79 సెకన్లలో లక్ష్యాన్ని ఛేదించి రికార్డులకెక్కింది. అయితే ఆ తర్వాత వెన్ను గాయంతో కొంత కాలం విశ్రాంతి తీసుకుంది.
ఈ నేపథ్యంలో హిమదాస్ భవిష్యత్తులో 200మీటర్ల పరుగులోనూ పాల్గొననున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. అయితే దీనిపై స్పందించిన ఆమె.. తన కోచ్, భారత అథ్లెట్ సమాఖ్య (ఏఎఫ్ఐ) తీసుకునే నిర్ణయంపై ఈ విషయం ఆధారపడి ఉంటుందని తెలిపింది.
ఫిట్‌గానే ఉన్నా
ప్రస్తుతం తాను ఫిట్‌గానే ఉన్నట్లు చెప్పుకొచ్చింది హిమదాస్. 30రోజులకు ముందు నుంచే ఔట్‌డోర్ ట్రైనింగ్‌లో పాల్గొంటున్నట్లు వెల్లడించింది. అయితే మితిమీరిన కసరత్తులేమి చేయకుండా పరిమితంగానే చేస్తున్నట్లు చెప్పింది.
"నేను తెల్లవారుజామున, సాయంత్రం మాత్రమే శిక్షణ తీసుకుంటున్నా. సైక్లింగ్, బౌలింగ్ వంటి ఎక్స్‌ర్‌సైజ్‌లు చేస్తున్నా."
-హిమదాస్.
దేశీయ పోటీలు
దీంతో పాటు ఏఎఫ్ఐ ప్రకటించిన దేశీయ పోటీల షెడ్యూల్ గురించి మాట్లాడింది హిమదాస్. కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో సెప్టెంబర్ 12నుంచి జరగాల్సిన ఈ సీజన్‌పై ఏఎఫ్ఐ సభ్యులు, కొంతమంది అథ్లెట్లు కలిసి చర్చిస్తారని తెలిపింది. అన్ని పరిస్థితులు పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేసింది.
ఇది చూడండి : 'దానికింకా సమయముంది.. అప్పుడే తొందరొద్దు'