ఎన్‌బీఏ (నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్).. ఈ పేరు భారత్‌లో ఎవ్వరికీ తెలియకపోవచ్చు. కానీ ఉత్తర అమెరికాలో చాలా ఫేమస్. ఈ పోటీలు తొలిసారిగా భారత్‌లో జరగనున్నాయి. అక్కడున్న ఆదరణ ఇండియాలో ఉంటుందా అనేది చెప్పలేం. కానీ 'హౌడీ మోదీ' సభలో ట్రంప్ చెప్పిన ఓ మాట ఈ పోటీలపై ఆసక్తిని పెంచింది.
"భారత్‌లో మొట్టమొదటి సారిగా ఎన్‌బీఏ బాస్కెట్‌బాల్ పోటీలు జరగనున్నాయి. మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ (మోదీ గారూ).. నన్ను మీరు ఆహ్వానిస్తారా? నేను రావొచ్చు.. జాగ్రత్త.."అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరదాగా అన్నారు. హ్యూస్టన్‌లో జరిగిన 'హౌడీ మోదీ' సభలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
ఉత్తర అమెరికాకు చెందిన జాతీయ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ఈ పోటీలు నిర్వహించనుంది. ఇందులో భాగంగా అక్టోబరు 4, 5 తేదీల్లో ముంబయిలో సక్రామెంటో కింగ్స్ - ఇండియానా పేసర్స్ జట్ల మధ్య పోటీలు జరగనున్నాయి. రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పోటీలను 3 వేల మంది విద్యార్థులు తిలకించనున్నారు.
దాదాపు 80 శాతం టికెట్లు ఇప్పటికే అమ్ముడై పోయాయని.. అందులో 90 శాతం వరకు అభిమానులు కొనుగోలు చేశారని నిర్వాహకులు తెలిపారు. పోటీలకు ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు భారీగానే వస్తారని అంచనా వేస్తున్నారు.
ఇవీ చూడండి.. టీమిండియా మాజీ క్రికెటర్ కన్నుమూత..