జాతీయ క్రీడల్లో తెలుగు రాష్ట్రాల అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శనివారం తెలంగాణ షూటర్ ఇషా సింగ్, ఆంధ్రప్రదేశ్ స్ప్రింటర్ జ్యోతి యర్రాజి బంగారు పతకాలు గెలిచారు. మహిళల 25మీ. పిస్టల్ విభాగంలో స్టార్ షూటర్ ఇషా అంచనాలకు తగ్గట్లు ఛాంపియన్‌గా నిలిచింది. మను బాకర్ (583)ను వెనక్కినెట్టి అర్హత రౌండ్లో 584 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచిన ఆమె.. తుదిపోరులోనూ అదే దూకుడు ప్రదర్శించింది. ఫైనల్లో 26 పాయింట్లతో పసిడి పట్టేసింది.
రిథమ్ సింగ్ (25- హరియాణా), అభిద్న (19- మహారాష్ట్ర) వరుసగా రజత, కాంస్య పతకాలు గెలుచుకున్నారు. రోలర్ స్కేటింగ్ ఆర్టిస్టిక్ జోడీ నృత్య విభాగంలో కాంతి- జుహిత్ (తెలంగాణ) జోడీ కంచు పతకం సొంతం చేసుకుంది. 71 పాయింట్లతో ఈ జంట మూడో స్థానాన్ని దక్కించుకుంది. యశస్వి- రాహుల్ (90.8- మహారాష్ట్ర), నటాలియా- ఆదిత్య (79- తమిళనాడు) జోడీలు వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచాయి.
పతక పరుగులు: 110మీ. హార్డిల్స్‌లో జాతీయ రికార్డు కలిగి ఉన్న జ్యోతి.. ఈ క్రీడల్లో మహిళల 100మీ. పరుగులో ఛాంపియన్‌గా నిలిచింది. 11.51 సెకన్లలో రేసు ముగించి స్వర్ణం ఖాతాలో వేసుకుంది. జాతీయ క్రీడల్లో ఇదే అత్యుత్తమ టైమింగ్. అర్చన (11.55సె- తమిళనాడు) రజతం, దియాండ్ర (11.62సె- మహారాష్ట్ర) కాంస్యం నెగ్గారు. ద్యుతి చంద్ (11.69సె), హిమదాస్ (11.74సె) లాంటి స్టార్ స్ప్రింటర్లు వరుసగా 6, 7 స్థానాల్లో నిలవడం గమనార్హం. మహిళల 400మీ. పరుగులో మరో ఏపీ అథ్లెట్ జ్యోతిక శ్రీ రజతం సొంతం చేసుకుంది. ఫైనల్లో ఆమె 53.30 సెకన్ల టైమింగ్‌తో రెండో స్థానంలో నిలిచింది. ఐశ్వర్య (52.62సె- మహారాష్ట్ర), రూపల్ (53.41సె- ఉత్తరప్రదేశ్) వరుసగా స్వర్ణ, కాంస్య పతకాలు గెలుచుకున్నారు.
పురుషుల వెయిట్‌లిఫ్టింగ్ 67 కేజీల విభాగంలో నీలం రాజు (ఏపీ) వెండి పతకం సాధించాడు. మొత్తం 270 కేజీల బరువెత్తి ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. సుభాష్ (275 కేజీలు- సర్వీసెస్) పసిడి, సుశాంత్ (270 కేజీలు- ఒడిషా) కంచు పతకం నెగ్గారు. "గెలుపోటములు గురించి ఆలోచిస్తూ ఇక్కడికి రాలేదు. మంచి టైమింగ్ నమోదు చేయాలనుకున్నా. ఇప్పుడు నా వేగవంతమైన రేసును పూర్తి చేశా. ద్యుతి, హిమదాస్ నన్నెప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటారు. అందుకు ధన్యవాదాలు. వాళ్లను ఓడించిన విషయాన్ని పట్టించుకోకుండా రేసు గెలిచినందుకు సంతోషపడుతున్నా" అని జ్యోతి చెప్పింది.
ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌కు జెస్విన్: పురుషుల లాంగ్‌జంప్‌లో పసిడి గెలిచిన జెస్విన్ అల్‌డ్రిన్ 2023 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌కూ అర్హత సాధించాడు. చివరి ప్రయత్నంలో 8.26 మీటర్ల దూరం దూకిన అతను.. ప్రపంచ ఛాంపియన్‌షిప్స్ అర్హత ప్రమాణాన్ని (8.25మీ) అందుకున్నాడు. కామన్వెల్త్ క్రీడల రజత విజేత మురళీ శ్రీశంకర్ (7.93మీ) రెండో స్థానానికి పరిమితమయ్యాడు. తొలి రెండు ప్రయత్నాల్లో వరుసగా 7.93మీ, 7.55మీ. దూరం దూకిన శ్రీశంకర్ తొడ కండరాల గాయం కారణంగా మిగతా నాలుగు సార్లు జంప్ చేయకుండా పోటీ నుంచి నిష్క్రమించాడు.
మహిళల పోల్‌వాల్ట్‌లో మీనా (4.20మీ) జాతీయ రికార్డు సృష్టించింది. 2014లో సురేఖ (4.15మీ) నమోదు చేసిన రికార్డును ఆమె తిరగరాసింది. పురుషుల 100మీ. పరుగులో అమ్లాన్ (10.38సె- అసోం), తమిళనాడు రన్నర్లు ఎలాకియదాసన్ (10.44సె), శివకుమార్ (10.48సె) వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. గుజరాత్‌లో ఉన్న పీవీ సింధు.. సూరత్‌లోని వజ్రాలకు సానబెట్టే కేంద్రాన్ని సందర్శించింది. అంతకుముందు ఆమె బ్యాడ్మింటన్ పోటీలను ప్రారంభించింది.