ప్రాక్టీస్ కోసం తన భార్య నగలు తాకట్టు పెట్టినట్లు పారాలింపిక్స్ (Tokyo Paralympics) కాంస్య పతక విజేత సింగ్‌రాజ్ అధానా (singhraj adhana) గుర్తు చేసుకున్నాడు. కరోనా లాక్డౌన్లో ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపాడు. ఆ సమయంలో సరైన ప్రాక్టీస్ లేక నిద్రపట్టేది కాదని, దాంతో పారాలింపిక్స్‌లో పతకం సాధించలేననే తీవ్ర నిరాశకు గురయ్యానని గుర్తుచేసుకున్నాడు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసినప్పుడు కూడా తన కష్టాలను వెల్లడించుకున్నాడు అధానా.
ఇటీవల కొవిడ్-19 రెండో దశ కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో పారాలింపిక్స్ సన్నాహకాలకు తీవ్ర ఇబ్బందులు పడ్డానని తెలిపాడు అధానా. దాంతో మానసిక వేదనకు కూడా లోనయ్యానన్నాడు. అదే సమయంలో తన కోచ్‌లు ఇచ్చిన సలహా మేరకు ఇంట్లోనే అంతర్జాతీయ స్థాయిలో షూటింగ్ రేంజ్ తయారుచేసుకున్నట్లు వెల్లడించాడు.
మంగళవారం జరిగిన పీ1 పురుషుల 10 మీటర్ల ఎయిర్‌పిస్టల్ ఎస్‌హెచ్-1 ఈవెంట్‌లో సింగ్‌రాజ్ కాంస్య పతకం సాధించాడు. ఈ నేపథ్యంలోనే మీడియాతో మాట్లాడుతూ తన అనుభవాలను పంచుకున్నాడు. "పారాలింపిక్స్‌కు ముందు సరైన ప్రాక్టీస్ లేకపోవడం వల్ల ఇక నేను పతకం గెలవలేనేమోనని భయపడ్డా. దాంతో నిద్ర కూడా పట్టేది కాదు. అప్పుడే మా కోచ్‌ల సలహా మేరకు ఇంటి దగ్గరే షూటింగ్ రేంజ్ తయారుచేయాలనుకున్నా. కానీ, అది లక్షల ఖర్చుతో కూడుకున్నది కావడం వల్ల మొదట ఇంట్లో వాళ్లు ధైర్యం చేయలేదు. చివరికి అందరి సహకారంతో దాన్ని పూర్తిచేశా" అని సింగ్‌రాజ్ గుర్తుచేసుకున్నాడు.
"ఆ సమయంలో ఏదైనా నష్టం కలిగితే కనీసం ఇంట్లో వాళ్ల భోజనానికి ఏ ఇబ్బందులు కలగకుండా చూసుకోమని మా అమ్మ చెప్పింది. అలా నా కుటుంబంతో పాటు పారాలింపిక్ కమిటీ, మా కోచ్‌లు సహకారం అందించారు. దాంతో ఒక్కరాత్రిలోనే లేఅవుట్ రూపొందించా. అది నిజంగా నిర్మించాలనుకుంటే అంతర్జాతీయ స్థాయిలో ఉండాలని, అది కేవలం ఈ పారాలింపిక్స్‌కు మాత్రమే కాకుండా పారిస్ గేమ్స్ వరకూ ఉండాలని మా కోచ్‌లు చెప్పారు. అలా చాలా స్వల్ప వ్యవధిలో దాన్ని నిర్మించి ప్రాక్టీస్ చేశా. అందువల్లే ఇప్పుడిక్కడ కాంస్యంతో మీముందు నిల్చున్నా" అని సింగ్‌రాజ్ వివరించాడు.
ఇదీ చూడండి: Tokyo Paralympics: హైజంప్‌లో భారత్‌కు రజతం, కాంస్యం