ఒలింపిక్స్‌లో పతకం గెలవలేదు.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లోనూ విజేతగా నిలవలేదు.. కానీ ఇవి సాధించిన క్రీడాకారుల్ని మించి గౌరవం దక్కించుకున్న అరుదైన అథ్లెట్ ఆయన!
కేవలం పతకాలతో కొలిచే ఔన్నత్యం కాదు మిల్కాది. అవే ప్రమాణాలైతే ఆటకు గుడ్‌బై చెప్పిన అర శతాబ్దం తర్వాత కూడా మిల్కా గురించి దేశం గొప్పగా మాట్లాడుకునేది కాదు. కళ్ల ముందే తల్లిదండ్రులు హత్యకు గురైతే.. బతుకు జీవుడా అనుకుంటూ దేశం దాటి ఇంకో దేశానికి వచ్చి.. కడుపు నింపుకోవడానికి నానా కష్టాలు పడి.. ఒక దశలో దొంగతనాలు కూడా చేసిన వ్యక్తి.. ఇప్పుడు దేశవ్యాప్తంగా కోట్లాదిమంది నుంచి కన్నీటి నివాళి అందుకోవడం వెనుక ఒక అసాధారణ ప్రయాణం ఉంది. బాల్యంతో మొదలు పెడితే.. ప్రతి దశలోనూ ఎదురైన పెద్ద పెద్ద అడ్డంకుల్ని దాటుతూ మిల్కా ముందుకు సాగిన వైనం స్ఫూర్తిదాయకం.
విభజనకు ముందు భారత్‌లోనే ఉండి, తర్వాత పాకిస్థాన్‌లో అంతర్భాగంగా మారిన పంజాబ్‌లో ఓ సిక్కు కుటుంబంలో పుట్టాడు మిల్కా. అప్పట్లో సరైన వైద్య సదుపాయాలు లేక మిల్కా తోబుట్టువులు 8 మంది పసిబిడ్డలుగా ఉండగానే చనిపోయారు. దేశ విభజన సమయంలో చెలరేగిన అల్లర్లలో మిల్కా కళ్ల ముందే అతడి తల్లిదండ్రులు, ఇద్దరు అక్కలు, ఒక సోదరుడు హత్యకు గురయ్యారు. అతడి బంధువర్గంలోనూ చాలామంది మరణించారు. కళ్ల ముందే తల్లిదండ్రులను కోల్పోయి.. ఉన్న ఊరిని విడిచిపెట్టి వందల కిలోమీటర్లు ప్రయాణించి వేరే దేశంగా మారిన ప్రాంతానికి రావాల్సి వస్తే ఆ 17 ఏళ్ల కుర్రాడి మానసిక స్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. విభజన సమయంలో తలెత్తిన అల్లర్ల కారణంగా రక్తంతో తడిసి ముద్దయిన రైలు బండిలో ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ప్రయాణం చేసి దిల్లీకి చేరుకున్నాడు మిల్కా. అక్కడ శరణార్థి శిబిరంలోనే చాన్నాళ్ల పాటు అతను, తన సోదరి, ఆమె భర్త బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఆ తర్వాత దిల్లీలోనే స్థిరపడ్డప్పటికీ.. ఆర్థికంగా ఏ ఆధారం లేక దుర్భరంగానే సాగింది మిల్కా జీవనం.
బూట్‌పాలిష్‌లు.. దొంగతనాలు
శరణార్థి శిబిరంలో ఉండగా మిల్కా కడుపు నింపుకోవడం కోసం కొంత కాలం బూట్ పాలిష్‌లు చేశాడు. తల్లిదండ్రులను కోల్పోయి, ఉన్న ఊరిని విడిచి పెట్టి వచ్చేశాక మిల్కా చదువు అటకెక్కేసింది. చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగించిన అతను.. తర్వాత దొంగతనాలకు అలవాటు పడ్డారు. ఒక గ్యాంగ్‌లో చేరి గూడ్స్ బండిలో వచ్చే ధాన్యం, ఇతర ఆహార పదార్థాలను దొంగిలించడం పనిగా పెట్టుకున్నాడు. ఒకసారి దొంగతనం చేస్తూ పట్టుబడి జైలుకు కూడా వెళ్లాడు మిల్కా. అతణ్ని బయటికి తేవడం కోసం తన సోదరి తన బంగారాన్ని అమ్ముకోవాల్సి వచ్చింది. దీంతో తర్వాత మిల్కా దొంగతనాలు మానేశాడు. గౌరవంగా బతకడం కోసం సైన్యంలో చేరడానికి ప్రయత్నించాడు. మూడుసార్లు ప్రయత్నించి విఫలమైనప్పటికీ.. నాలుగోసారి అతడి లక్ష్యం నెరవేరింది.
గ్లాసు పాలు ఇస్తారని..
మిల్కా అథ్లెటిక్స్‌లోకి అడుగు పెట్టడం చిత్రంగా జరిగింది. సైన్యంలో చేరి సికింద్రాబాద్‌లో పోస్టింగ్ తెచ్చుకున్నాక అక్కడ శిక్షణ పొందుతున్న క్రమంలో ఆర్మీ కోచ్ గురుదేవ్ సింగ్.. మిల్కా, అతడి సహచరులను అయిదు మైళ్ల క్రాస్ కంట్రీ రేసుకు ఆహ్వానించాడు. తాను పెట్టే పందెంలో టాప్-10లో నిలిచిన వారికి రోజూ అదనంగా ఒక గ్లాసు పాలు ఇస్తానని ప్రకటించాడు. అదనపు పాల మీద ఆశతోనే జోరుగా పరుగెత్తి ఆరో స్థానంలో నిలిచాడు. తర్వాత శిక్షణలో భాగంగా మిల్కా ప్రతిభ చూసి 400 మీటర్ల పరుగు అతడికి నప్పుతుందని అందులోకి దించాడు కోచ్.
‘ఫ్లయింగ్ సిఖ్’ అలా వచ్చింది
రోమ్ ఒలింపిక్స్ వైఫల్యం మిల్కాను కుంగదీసింది. కొంత కాలం పాటు అతను పోటీలకు దూరంగా ఉండిపోయాడు. ఆ సమయంలోనే భారత్, పాకిస్థాన్ మధ్య స్నేహభావం పెంపొందించేందుకు ఇండో-పాక్ స్పోర్ట్స్ మీట్ నిర్వహించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. అయితే ఈ పోటీల కోసం పాకిస్థాన్ వెళ్లేందుకు మిల్కా నిరాకరించాడు. పాక్‌కు వెళ్తే తన తల్లిదండ్రుల హత్య తాలూకు చేదు అనుభవాలు వెంటాడుతాయన్న భయమే అందుక్కారణం. అయితే స్వయంగా భారత ప్రధాని నెహ్రూ మిల్కాతో మాట్లాడి ఆ పోటీలకు వెళ్లేలా ఒప్పించాడు. అక్కడ ఆసియాలోనే ఉత్తమ స్ప్రింటర్లలో ఒకడిగా పేరున్న అబ్దుల్ ఖాలిఖ్‌ను 400 మీటర్ల రేసులో ఓడించి మిల్కా తన సత్తాను చాటిచెప్పాడు. ఆ రేసులో మిల్కా పరుగెత్తిన తీరుకు ముగ్ధుడైన పాకిస్థాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్.. అతడికి ‘ఫ్లయింగ్ సిఖ్’ అనే బిరుదునిచ్చాడు. 1960లో జరిగిన ఈ రేసు తర్వాత మిల్కా ఇంకో నాలుగేళ్లు ఆటలో కొనసాగాడు. 1964 జకార్తా ఆసియా క్రీడల్లో 400 మీ, 4×400 మీ. రిలే రేసుల్లో స్వర్ణాలు సాధించాక ట్రాక్‌కు టాటా చెప్పాడు. మిల్కా జీవితంలో ఇంత నాటకీయత, ఇన్ని మలుపులు, ఇంత ఔన్నత్యం ఉన్నాయి కాబట్టే ‘బాగ్ మిల్కా బాగ్’ పేరుతో ఆయనపై ఓ సినిమా తెరకెక్కింది. భావోద్వేగాలను తట్టి లేపి మిల్కా మీద గౌరవభావాన్ని తీసుకొచ్చే చిత్రమిది.
అవమానాలు, వైఫల్యాలే ప్రేరణగా..
ప్రపంచ వేదికలపై ఓ భారత అథ్లెట్ పతకాలు సాధించడం సంగతలా ఉంచితే.. కనీస పోటీ ఇవ్వలేని స్థితిలో మిల్కా అసాధారణ ప్రదర్శనే చేశాడు. ఆసియా క్రీడల 400 మీటర్ల పరుగులో నాలుగు స్వర్ణ పతకాలు కొల్లగొట్టాడు. 1958లో కామన్వెల్త్ క్రీడల్లోనూ 400 మీ. విజేతగా నిలిచాడు. అవమానాలు, వైఫల్యాల వల్ల వచ్చిన పట్టుదలతోనే మిల్కా ఈ విజయాలు సాధించగలిగాడు. అయితే 1956 ఒలింపిక్స్ కోసం సెలక్షన్ ట్రయల్స్‌కు వెళ్తే.. అక్కడి స్ప్రింటర్లు మిల్కాను అవమానించారు. వారితో గొడవపడి గాయపడ్డా సరే సెలక్షన్ ట్రయల్స్‌లో సత్తా చాటి మెల్‌బోర్న్ బెర్త్ సంపాదించాడు. అయితే అక్కడ క్వాలిఫయింగ్ రౌండును కూడా దాటలేకపోయాడు. ఒలింపిక్స్ లాంటి మెగా ఈవెంట్లో పోటీ పడేందుకు ఆషామాషీ సాధన సరిపోదని భావించిన మిల్కా.. ఎడారిలో, సముద్ర మట్టానికి ఎంతో ఎత్తయిన ప్రదేశాల్లో నెలల తరబడి సాధన చేశాడు. ఆ సమయంలో అతడికి రక్తపు వాంతులు అయినా విశ్రమించలేదు.
0.1 సెకను తేడాతో..
మిల్కా స్ప్రింట్ కెరీర్లో అత్యంత ముఖ్యమైన ఘట్టం 1960 రోమ్ ఒలింపిక్స్. అక్కడి వెళ్లడానికి మిల్కా అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఎన్నో ఆశల మధ్య రోమ్‌లో అడుగు పెట్టిన మిల్కా.. ఫైనల్‌కు అర్హత సాధించాడు. అయితే ఫైనల్ రేసు చివరి దశలో తల తిప్పి వెనక్కి చూడటం అతడికి ప్రతికూలమైంది. 0.1 సెకను తేడాలో మిల్కా కాంస్య పతకం కోల్పోయాడు. నాలుగో స్థానానికి పరిమితమయ్యాడు. తల్లిదండ్రుల మరణం తర్వాత తన జీవితంలో అత్యంత బాధ పెట్టిన సందర్భం ఇదేనంటాడు మిల్కా. అయితే ఈ రేసులోనే మిల్కా జాతీయ రికార్డు (45.6 సెకన్లు) నెలకొల్పాడు. అది 1998 వరకు నిలిచి ఉండటం విశేషం.
ఆ రికార్డు తిరగరాయడానికి మిల్కానే స్ఫూర్తి
పురుషుల 400మీ. పరుగులో మిల్కా సింగ్ నమోదు చేసిన జాతీయ రికార్డును బద్దలు కొట్టడానికి ఆయనే స్ఫూర్తిగా నిలిచారని పరమ్‌జీత్ సింగ్ అన్నాడు. 1960 రోమ్ ఒలింపిక్స్‌లో త్రుటిలో కాంస్యం కోల్పోయిన మిల్కా.. 45.6 సెకన్ల టైమింగ్‌తో జాతీయ రికార్డు నెలకొల్పారు. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ టైమింగ్ ప్రకారం దాన్ని 45.74 సెకన్లుగా మార్చారు. ఆ రికార్డును 1998లో పరమ్‌జీత్ 45.70 సెకన్ల టైమింగ్‌తో తిరగరాశారు. "మిల్కా పేరుతో ఉన్న జాతీయ రికార్డును బద్దలు కొట్టిన తర్వాత ఆయన తన ఇంటికి పిలిచి విందు భోజనం పెట్టారు. ఆయన వ్యక్తిత్వం ఎంతో గొప్పది. ఆయన మరణం దేశానికి తీరని లోటు. ఆయన స్ఫూర్తితోనే జాతీయ రికార్డు సాధించా" అని పరమ్‌జీత్ పేర్కొన్నాడు. ప్రస్తుతం 400మీ. పరుగులో జాతీయ రికార్డు అనాస్ (45.21సె) పేరు మీద ఉంది
మిల్కా పేరుతో ప్రత్యేక విభాగం
పటియాలాలోని క్రీడా విశ్వవిద్యాలయంలో మిల్కా సింగ్ పేరుతో ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ శనివారం ప్రకటించారు. మిల్కా నివాసానికి వెళ్లి ఆయన కొడుకు జీవ్, ఇతర కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సానుభూతి తెలిపారు. అప్పటి ప్రధాని నెహ్రూతో మిల్కా ఉన్న చిత్రపటాన్ని ఆయన తన వెంట తీసుకెళ్లారు. "పటియాలాలోని క్రీడా విశ్వవిద్యాలయంలో మిల్కా పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తాం. మిల్కా విజయానికి గుర్తుగా 1960లో ఓ రోజును జాతీయ సెలవుగా ప్రకటించినపుడు నెహ్రూతో ఆయన ఈ ఫొటో తీసుకున్నారు. ఇప్పుడు కూడా జాతీయ సెలవు దినంగా ప్రకటించాలనే కోరిక ఉంది. కానీ నేను అలా చేయలేను. మా రాష్ట్రంలో సెలవు ప్రకటించి, సంతాప దినంగా పాటిస్తున్నాం" అని అమరీందర్ పేర్కొన్నారు.
బాగానే ఉన్నా.. కోలుకుంటా
గత నెలలో కరోనా బారిన పడ్డ తర్వాత కూడా మిల్కా సింగ్ ఎంతో సానుకూల దృక్పథంతో కనిపించారు. మహమ్మారి నుంచి బయటపడతాననే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. "అవును.. నాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. కానీ ఇప్పుడు నేను బాగానే ఉన్నా. ఎలాంటి ఇబ్బంది లేదు. జ్వరం, దగ్గు లాంటి లక్షణాలు లేవు. వైరస్ కూడా తగ్గిపోతుంది. మూణ్నాలుగు రోజుల్లో సాధారణ స్థితికి చేరుకుంటానని నా వైద్యుడు తెలిపాడు. మా వంట మనిషికి జ్వరం వచ్చింది. కానీ ఆ విషయాన్ని అతను దాచాడు. ఆ తర్వాత మేం కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నాం. నాకు వైరస్ ఎలా సోకిందోనని ఆశ్చర్యంగా ఉంది. ఉదయం పూట నడక, వ్యాయామం చేస్తున్నా. మిగతా సమయాల్లో ఇంట్లోనే ఉంటున్నా. ఈ సమయంలో వ్యాయామం చేస్తూ ఆరోగ్యంగా ఉండడం ఎంతో ముఖ్యమని ప్రజలకు చెప్తున్నా" అని అప్పుడు మిల్కా తెలిపారు. కానీ ఆ తర్వాత ఆరోగ్యం క్షీణించడం వల్ల ఆసుపత్రిలో చేరారు. 91 ఏళ్ల వయసులోనూ ఎంతో చలాకీగా ఉండే ఆయన.. మహమ్మారికి చిక్కి ప్రాణాలు విడిచారు.