గత ఒలింపిక్స్‌లతో పోల్చుకుంటే టోక్యోకు వెళ్తున్న ప్రస్తుత భారత షూటింగ్ జట్టే అత్యుత్తమని దిగ్గజ షూటర్ గగన్ నారంగ్ అభిప్రాయపడ్డాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో కాంస్య పతకం గెలిచిన నారంగ్.. గత కొంతకాలంగా యువ క్రీడాకారులకు కోచ్‌గా, మార్గదర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత షూటర్ల అవకాశాలపై నారంగ్ 'ఈనాడు'తో పంచుకున్నాడు.
"ఒలింపిక్స్‌లో తొలిసారిగా భారత షూటింగ్ జట్టు భారీ బృందంతో బరిలో దిగుతోంది. 15 మంది షూటర్లు వెళ్తున్నారు. అందులో నలుగురికి విశ్వక్రీడల్లో ఆడిన అనుభవముంది. మిగతా వాళ్లంతా మొదటిసారి ఈ మెగా ఈవెంట్లో పాల్గొంటున్నారు. అత్యుత్తమ క్రీడాకారులే జట్టుకు ఎంపికయ్యారు. కరోనా కాలంలోనూ షూటర్ల శిక్షణ ఆగలేదు. మహమ్మారి తీవ్రత కంటే ముందే షూటర్లంతా విదేశాలకు వెళ్లారు. ఒలింపిక్స్‌కు ముందు చివరి శిక్షణ శిబిరం వేరే దేశంలోనే జరిగింది. వారికి మంచి ప్రాక్టీస్ లభించింది. భారత షూటర్లంతా ఒలింపిక్స్‌లో సత్తాచాడటం ఖాయం."
-గగన్ నారంగ్, భారత షూటర్.
ప్రతి ఒక్కరూ అర్హులే..
"ప్రతి ఒక్క భారత షూటర్ పతకం సాధించడానికి అర్హులే. అత్యుత్తమ భారత జట్టు ఒలింపిక్స్‌లో బరిలో దిగుతుంది. ఇప్పటి వరకు జరిగిన ఒలింపిక్స్‌లతో పోల్చుకుంటే ఇదే అత్యుత్తమ బృందం. ప్రతి ఒక్కరు పతకం సాధించగల సత్తా ఉన్నవాళ్లే. టీమ్ విభాగాలు, వ్యక్తిగత ఈవెంట్లలో భారత క్రీడాకారులు మెరవడం ఖాయం. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో భారత క్రీడాకారులు ఫేవరెట్‌గా కనిపిస్తున్నారు. గత దశాబ్ద కాలంలో భారత షూటర్ల ఆలోచన దృక్పథంలో చాలా మార్పొచ్చింది. మా కెరీర్ ఆరంభమైన తొలినాళ్లలో ఒలింపిక్స్‌లో పాల్గొంటేనే గొప్పగా భావించేవాళ్లం. ప్రత్యర్థులతో పోటీపడటం.. పతకం సాధించడం ఊహకు అందని విషయాలు. ప్రస్తుత యువ క్రీడాకారులు మాత్రం నేరుగా ఒలింపిక్స్ పతకాలకే గురిపెడుతున్నారు" అని నారంగ్ పేర్కొన్నాడు.
"ఈసారి ఒలింపిక్స్ పూర్తిగా భిన్నం. కరోనా సమయంలో జరగుతున్నాయి. ఒలింపిక్స్ నిర్వాహకులు నిబంధనలకు సంబంధించి 'ప్లే బుక్' విడుదల చేశారు. క్రీడాకారులు యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. లొకేషన్ షేర్ చేయాలి. ఎక్కడికి వెళ్లినా నిర్వాహకులకు తెలియజేయాలంటూ ఎన్నో ఉన్నాయి. క్వారంటైన్ మొదలుకుని పోటీలు ముగిసే వరకు ప్రతిరోజూ అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఈ నిబంధనలు, పరిస్థితులకు క్రీడాకారులు ఎంత త్వరగా అలవాటు పడతారన్నది కీలకం. షూటింగ్‌లో ఎవరైనా గెలవొచ్చు. స్టార్ క్రీడాకారులు తొలి రౌండ్లోనే ఓడిపోవచ్చు. ఒకరిద్దరు స్టార్లు లేకపోయినంత మాత్రాన పెద్దగా తేడా ఉండదు. పతకం కోసం పోటీపడేవాళ్లు చాలామందే ఉన్నారు. పోటీ రోజు ఏకాగ్రతతో గురిపెట్టిన వాళ్లదే విజయం" అని గగన్ అభిప్రాయపడ్డాడు.
ఇదీ చదవండి: Olympics: ఒలింపిక్స్‌తో భారత అథ్లెట్ల తొలి బ్యాచ్