Djokovic Covid 19: టెన్నిస్ నంబర్ వన్ క్రీడాకారుడు నోవాక్ జకోవిచ్ డిసెంబర్లో కొవిడ్-19 బారిన పడినట్లు ఇతడి తరఫున లాయర్లు శనివారం మెల్‌బోర్న్‌లోని ఫెడరల్ కోర్టుకు విన్నవించారు. అందువల్లే అతడికి 'ఆస్ట్రేలియా ఓపెన్'లో పాల్గొనడానికి వైద్యపరమైన ప్రత్యేక మినహాయింపు ఇచ్చారని తెలిపారు.
జకోవిచ్ ఈ సీజన్‌లో తొలి గ్రాండ్ స్లామ్ టోర్నీ అయిన 'ఆస్ట్రేలియన్ ఓపెన్'లో పాల్గొనేందుకు మూడు రోజుల క్రితం మెల్‌బోర్న్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అతడికి సరైన వీసా అనుమతులు, వైద్యపరమైన మినహాయింపులున్నా.. వాక్సినేషన్‌కు సంబంధించిన ధ్రువపత్రాలు లేని కారణంగా ఆస్ట్రేలియా బోర్డర్ ఫోర్స్ అధికారులు అడ్డుకున్నారు. జకోవిచ్ వీసాను రద్దు చేసి డిటెన్షన్ సెంటర్‌లో ఉంచారు. ఈ విషయం పెద్ద చర్చనీయాంశంగా మారగా.. అక్కడే ఉన్న జకోవిచ్ ఆస్ట్రేలియా తీరుపై న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించాడు.
ఈ క్రమంలోనే శనివారం తన లాయర్ల ద్వారా వాదనలు వినిపించాడు జకోవిచ్. అలాగే ఇప్పుడు అతడు ఉంటున్న డిటెన్షన్ సెంటర్ నుంచి తరలించాలని, ఈనెల 17 నుంచి ప్రారంభమయ్యే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనేందుకు తనకు వీసా రద్దును తొలగించాలని కోరాడు. ఇప్పుడు తనకు ప్రాక్టీస్ చేసుకునే వీలు కల్పించాలని కూడా ఈ నంబర్ వన్ ఆటగాడు అభ్యర్థించాడు. కాగా, జకోవిచ్ ఉంటున్న ప్రదేశంలో పలువురు సెర్బియన్ పౌరులు నిరసన తెలిపారు. అతడిని ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనేలా చూడాలని కోరుతున్నారు.