భారత క్రీడా చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. జమ్ముకశ్మీర్‌లోని గుల్మార్గ్‌లో.. ఖేలో ఇండియా తొలి వింటర్ గేమ్స్ మొదలయ్యాయి. జమ్ముకశ్మీర్ క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో జరిగే ఈ క్రీడలను.. ఈనెల 11 తేదీ వరకూ నిర్వహిస్తారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన దాదాపు 9వందల మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఈటీవీ భారత్ ఈ క్రీడలకు మీడియా భాగస్వామిగా వ్యవహరిస్తోంది.
ఖేలో ఇండియా వింటర్ క్రీడల్లో భాగంగా స్నో స్కీయింగ్, స్నోబోర్డింగ్, స్నో షూయింగ్, స్కీ పర్వతారోహణ, ఐస్ స్టాక్, స్నో రగ్బీ, స్నో బేస్ బాల్ విభాగాల్లో పోటీలను నిర్వహిస్తున్నారు. గుల్మార్గ్‌లో మంచు చక్కగా కురుస్తూ ఉండడంతో వింటర్‌క్రీడల నిర్వహణకు ఇది సరైన సమయం అని జమ్ము కశ్మీర్‌క్రీడా సమాఖ్య తెలిపింది.
మంచుతో ముడిపడిన అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు భారత క్రీడాకారులకు ఈ పోటీలు ద్వారాలు తెరుస్తాయని భావిస్తున్నారు. ప్రపంచ ప్రసిద్ధ మంచు పర్వతారోహణ ప్రాంతంగా పేరుగాంచిన గుల్మార్గ్‌లో పోటీలు నిర్వహించడం వల్ల అంతర్జాతీయంగా కూడా ఈ పోటీలకు గుర్తింపు వస్తుందని కిరణ్ రిజిజు అభిప్రాయపడ్డారు.
" ఈరోజు చరిత్రాత్మకమైన రోజు. కేవలం జమ్ముకశ్మీర్‌కు మాత్రమే కాదు మొత్తం భారత్‌కు కూడా చరిత్రాత్మకమైన రోజు. తొలి సారిగా ఖేలో ఇండియా వింటర్‌క్రీడలు ప్రారంభం అయ్యాయి. ఒలింపిక్ క్రీడల్లో శీతాకాల క్రీడలు ఉంటాయి, వేసవి కాల క్రీడలు కూడా ఉంటాయి. శీతాకాల క్రీడల్లో భారత క్రీడాకారులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలి అనేది మా ఆకాంక్ష. భారత్‌లో శీతాకాల పోటీలకు జమ్ము కశ్మీర్‌ముఖ్య కేంద్రంగా మారాలి అనేది మా కోరిక. అనేక మంది ఒలింపిక్ క్రీడాకారులు ఇక్కడ తయారు కావాలి అని మా ఆకాంక్ష. దేశంలోని శీతాకాల క్రీడాకారులు, శీతాకాల క్రీడా ప్రేమికులు ఇక్కడకు వచ్చి ఆ క్రీడలను ఆస్వాదిస్తారని, వాటిలో పాల్గొంటారని మా ఆశ"
-- కిరణ్ రిజిజు, కేంద్ర క్రీడల శాఖ మంత్రి
ఖేలో ఇండియా తొలి వింటర్‌క్రీడల కోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఈ పోటీల ప్రచారం కోసం దేశ వ్యాప్తంగా రోడ్‌షోల నిర్వహణ, విమానాశ్రయాలు, ప్రముఖ ప్రాంతాల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ప్రముఖ క్రీడాకారులతో కూడా ప్రచారం చేయించారు.