ఒలింపిక్స్ వద్దంటూ ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను తగ్గించే ప్రయత్నాలను జపాన్ ప్రభుత్వం మొదలెట్టింది. మరో రెండు నెలల్లో టోక్యో క్రీడలు ఆరంభం కావాల్సి ఉండగా.. సోమవారం నుంచి పెద్ద ఎత్తున ప్రజలకు టీకా వేసే ప్రక్రియను వేగవంతం చేసింది.
ఎక్కువ సంఖ్యలో కేంద్రాలు ఏర్పాటు చేసి.. ఆ దేశంలోని వృద్ధులకు వీలైనంత త్వరగా టీకాలు అందించే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. అందులో భాగంగానే జులై 23న ఒలింపిక్స్ ఆరంభమయ్యే టోక్యోతో పాటు ఒసాకాలో 65 ఏళ్లు పైబడిన వాళ్లకు టీకాలు ఇచ్చేందుకు సైన్యానికి చెందిన వైద్యసిబ్బందిని రంగంలోకి దించింది.
వచ్చే మూడు నెలల పాటు టోక్యోలో రోజుకు 10 వేల మందికి, ఒసాకాలో రోజుకు 5వేల మందికి టీకా వేసేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఒలింపిక్స్‌ను నిర్వహించాలనే పట్టుదలతో ఉన్న ప్రధాని యోషిహిదే సూగా.. జులై చివరి నాటికి ఆ దేశంలోని 3.6 కోట్ల వృద్ధులకు టీకాలు వేయడం పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారు.
ఇప్పటివరకూ నత్తనడకన సాగిన ఆ ప్రక్రియ కారణంగా ఆ దేశ జనాభాలో కేవలం 2 శాతం మందికి మాత్రమే టీకా వేశారు. దీంతో పూర్తిస్థాయిలో టీకా పంపిణీ చేయకుండానే ప్రజల ప్రాణాలను ప్రమాదంలో నెట్టి ఎలా ఒలింపిక్స్ నిర్వహిస్తారంటూ స్థానికులు విమర్శిస్తున్నారు. అలాగే, వైరస్ కట్టడి కోసం టోక్యో సహా ఆ దేశంలోని పది ప్రాంతాల్లో అత్యయిక స్థితిని కొనసాగిస్తున్నారు. "టీకా ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం. దీనివల్ల ప్రజలు టీకా పొంది తిరిగి సాధారణ జీవితాన్ని త్వరలోనే గడిపే అవకాశం ఉంది" అని టోక్యోలోని టీకా కేంద్రాన్ని సందర్శించిన సూగా తెలిపారు.
దేశ జనాభాలోని 80 నుంచి 90 శాతం మందికి టీకా వేయడం పూర్తయితే అప్పుడు ఒలింపిక్స్‌ను ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహించవచ్చు అని ఓ 71 ఏళ్ల వృద్ధుడు అన్నాడు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమయేలా కనిపించడం లేదు. వైద్య సిబ్బంది కొరత కూడా అందుకు ఓ కారణం.
ఇదీ చూడండి: ఒలింపిక్స్‌కు కరోనా గండం- ఈ ఏడాదైనా జరిగేనా?