జమైకా చిరుతపులిగా గుర్తింపు పొందిన ఉసేన్ బోల్ట్‌కు భారీ షాక్ తగిలింది. 2008, 2012, 2016 ఒలింపిక్స్ పరుగుల పోటీల్లో ఎనిమిది బంగారు పతకాలు సాధించిన అతడు ఆర్థిక మోసం బారినపడ్డాడు. అతడి ఖాతా నుంచి ఏకంగా 12.7 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.103కోట్లకు పైనా) మాయమైపోయాయి.
ఇంతకీ ఏం జరిగిందంటే.. రిటైర్మెంట్, లైఫ్‌టైం సేవింగ్స్‌లో భాగంగా .. జమైకాకు చెందిన స్టాక్స్ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ (ఎస్‌ఎస్‌ఎల్) సంస్థలో బోల్ట్ కొన్నేళ్ల క్రితం ఓ పెట్టుబడి ఖాతా తెరిచాడు. ఈ ఖాతాలో అతడికి 12.8 మిలియన్ డాలర్లు ఉండగా.. జనవరి రెండో వారం నాటికి కేవలం 12000 డాలర్ల బ్యాలెన్స్ మాత్రమే చూపించింది. ఈ విషయాన్ని బోల్ట్ న్యాయవాది ద్వారా తెలిసింది. కంపెనీలో జరిగిన మోసపూరిత చర్య వల్ల డబ్బులు మాయమైనట్లు ఆయన ఆరోపించారు. పది రోజుల్లోగా ఆ డబ్బును తిరిగి ఖాతాలో జమచేయాలని, లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన కెంపెనీని హెచ్చరించారు.
కాగా.. ఈ మోసాన్ని ఈ నెల ఆరంభంలోనే గుర్తించినట్లు స్టాక్స్ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ తెలిపింది. ఓ మాజీ ఉద్యోగి మోసపూరిత కార్యకలాపాల కారణంగా తమ క్లయింట్స్ ఖాతాల్లో నుంచి మిలియన్ డాలర్ల మొత్తం మాయమైనట్లు కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఉసేన్ బోల్ట్ సహా దాదాపు 30 మంది ఖాతాదారులు డబ్బులు కోల్పోయినట్లు పేర్కొంది. దీనిపై దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేశామని, ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది. తమ ఖాతాదారుల ఆస్తులను మరింత భద్రంగా చూసుకొనేందుకు మరిన్ని భద్రత చర్యలు తీసుకుంటామని పేర్కొంది.