రోమ్ వేదికగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సమావేశం జరిగింది. ఇందుకు దాదాపు 100 మంది అధికారులు హాజరయ్యారు. ఈ వేదికపై ఇటలీకి చెందిన ఒలింపిక్ పసిడి పతక విజేత సోఫియా, మిచెల్ తమ దేశంలోని ప్రస్తుత పరిస్థితిని వివరించారు. వీరిద్దరూ తాజాగా 2026 ఒలింపిక్స్ కోసం బిడ్డింగ్‌లో పాల్గొన్నారు.
ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్ షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని చెప్పిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి... వీరిద్దరూ ఇటలీ ప్రస్తుత పరిస్థితి గురించి చెప్పారు. దక్షిణ ఇటలీలోని బెర్గామో ప్రాంతానికి కొద్ది మైళ్ల దూరంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం చర్చి గంటలు మోగుతుంటే తమ మృత్యు ఘంటికలు మోగుతున్నట్లు ఉందని తమ గోడు చెప్పుకున్నారు. సోఫియా బామ్మ కూడా ఈ వైరస్‌కు గురై చికిత్స పొందుతూ మృతి చెందినట్లు చెప్పింది.
" ఇళ్ల వద్ద ప్రస్తుతం యుద్ధవాతావరణం నెలకొని ఉంది. మా ప్రాంతమంతా జనసంచారం లేక బోసిపోతోంది. ఎవరైన చనిపోతే మోగించే చర్చి గంటలు, అంబులెన్స్ శబ్దాలు తప్ప ఏమీ వినపడట్లేదు. శవపేటికలకు డిమాండ్ పెరిగింది. వాటిని పూడ్చటానికి మనుషులే లేరు. ప్రతి కుటుంబంలో ఒకరు కరోనాతో బాధపడుతున్నారు"
-- మిచెల్ మొయిలి, స్నో బోర్డింగ్‌లో ఒలింపిక్ పతక విజేత
చాలా మంది ప్రజలు జ్వరం, దగ్గు, నిమోనియా ఇబ్బంది పడుతున్నారని... బెర్గామో వద్ద ఉన్న లాంబార్డీ ప్రాంతంలో ఎక్కువ మంది చనిపోయినట్లు వీరిద్దరూ తెలిపారు. చనిపోయినవారికి అంతిమ సంస్కారాలు నిర్వర్తించేందుకు అవకాశం కూడా ఉండట్లేదని అభిప్రాయపడ్డారు.
శవాలను ఆర్మీ అధికారులు వాహనాల్లో తీసుకుళ్లి పూడ్చిపెడుతున్నట్లు పేర్కొంటూ ఇటీవల ఓ ఫొటోను షేర్ చేసింది మిచెల్. తాజాగా ఆ దేశంలో చనిపోయిన వ్యక్తుల కోసం ఇచ్చే శ్రద్ధాంజలి ప్రకటనలతో పేపర్లు నిండిపోవడం బాగా చర్చనీయాంశమైంది.