ఒలింపిక్స్‌లో(Tokyo Olympics) దేశం గర్వించగదగ్గ స్థాయిలో భారత అథ్లెట్లు ప్రదర్శన చేస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది స్టార్ షట్లర్ పీవీ సింధు. మంగళవారం.. మెగాక్రీడల్లో పాల్గొనే మన క్రీడాకారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఆటలు, కెరీర్‌కు సంబంధించి పలు విశేషాలను అథ్లెట్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానితో మాట్లాడిన సింధు ఈ వ్యాఖ్యలు చేసింది.
"ప్రధాని నరేంద్రమోదీ సహా మిగతా అథ్లెట్లతో మాట్లాడటం ఎంతో ఆనందం, గౌరవంగా ఉంది. మమల్ని ప్రోత్సాహిస్తున్న ప్రధానికి సహా యావత్ దేశానికి నా కృతజ్ఞతలు. ఒలింపిక్స్‌లో దేశం గర్వించదగ్గ స్థాయిలో బాగా రాణిస్తామని ఆశిస్తున్నాను."
-సింధు, స్టార్ షట్లర్.
"వాళ్లలో స్ఫూర్తిని నింపాలి. ప్రోత్సహించాలి. ప్రభుత్వం క్రీడాకారులకు అన్నీ రకాల సాకర్యాలను అందిస్తుంది. ఇవన్నీ వారికి తెలియజేయాలి. 'దేశానికి మంచి పేరు తీసుకురావాలి, బాగా శ్రమించాలి, ఇతరులను గౌరవించాలి' అని మంచి మాటలు వారికి చెప్పాలి."
-సింధు తల్లిదండ్రులు
మోదీ: ఆటలో ఛాంపియన్‌గా ఎదగడానికి ఎటువంటి అర్హతలు ఉండాలి?
"టెన్నిస్‌లో చాలామంది పెద్ద ప్లేయర్స్ అవ్వాలని అనుకుంటారు. అందుకు కష్టపడేతత్వం, ప్రోత్సాహం, నిబద్ధత వారికి ఉండాలి. శ్రమ, ప్రతిభ లేకపోతే ఏమి చేయలేం."
-సానియా మీర్జా, టెన్నిస్ స్టార్.
మోదీ: ఈ మెగాఈవెంట్ పట్ల మీ ఆలోచన ఏంటి?
"నేను చేనేత కుటుంబానికి చెందిన వ్యక్తిని. నాకు ఆరుగురు సోదరిలు, ఓ సోదరుడు, అమ్మ, నాన్న ఉన్నారు. ఇదే నా కుటుంబం. ఇంత మంది ఆడపిల్లలను జన్మనిచ్చినందుకు మా అమ్మను గ్రామస్థులంతా విమర్శిస్తున్నారు. ఈ మెగా క్రీడాల్లో బాగా ఆడితే నాకు ప్రభుత్వం ఉద్యోగం వస్తుంది. దీంతో నా కుటుంబాన్ని బాగా చూసుకోవచ్చు. ఇది నాకు రెండో ఒలింపిక్స్. ఎటువంటి భయం లేకుండా నేను పాల్గొంటున్నాను. దేశానికి పతకం తీసుకురావాలని భావిస్తున్నా. అదే నా లక్ష్యం."
-ద్యుతి చంద్, స్ప్రింటర్.
"మోదీతో మాట్లాడం ఎంతో అద్భుతంగా ఉంది. ఆయనెప్పుడూ మేము బాగా రాణించాలని ప్రోత్సహిస్తారు. ఒలింపిక్స్‌కు ముందు ఆయన మాతో మాట్లాడటం ఎంతో స్ఫూర్తినిచ్చింది. మాకు అండగా నిలిచిన యావత్ దేశానికి కృతజ్ఞతలు."
-మన్‌ప్రీత్ సింగ్, పురుషుల హాకీ జట్టు కెప్టెన్.
మెదీ: గాయం నుంచి కోలుకుని జాతీయ రికార్డును ఎలా సాధించారు?
"ప్రపంచ ఛాంపియన్షిప్, ఆసియన్ ఛాంపియన్‌షిప్‌కు దూరమైన తర్వాత ఒలింపిక్స్‌పై దృష్టి పెట్టాను. బాగా శ్రమించాను. ఈ మెగాక్రీడలు వాయిదా పడినప్పటికీ నా శిక్షణను ఆపలేదు. అలానే అర్హత సాధించాను."
-నీరజ్ చోప్రా, జావెలిన్ త్రోయర్.
మెదీ: మేరీ కోం ఫేవరేట్ బాక్సింగ్ పంచ్, బాక్సర్ ఎవరు?
"మహ్మద్ అలీ నాకు స్ఫూర్తి. ఆయన్ను చూసే బాక్సింగ్‌పై మక్కువ పెంచుకున్నాను. ఒలింపిక్స్‌లో బాగా రాణిస్తాను."
-మేరీ కోమ్, బాక్సర్.
ఇంకా పలువురు అథ్లెట్లతో మట్లాడారు మోదీ. వారితో ముచ్చటిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. క్రీడాకారులు అంచనాలకు తలవంచకుండా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని పిలుపునిచ్చారు. వారి వెనక దేశం మొత్తం అండగా ఉందన్నారు. అత్యున్నత క్రీడా వేదికపై అథ్లెట్లు రాణించి భారత పతాకం రెపరెపలాడించాలని అభిలషించారు.
జులై 23న ప్రారంభం కానున్న ఒలింపిక్స్‌కు 228 మందితో కూడిన భారత బృందం టోక్యోకు వెళ్లనుంది. అందులో 119 మంది అథ్లెట్లు ఉన్నారు. వీరిలో 67 మంది పురుషులు, 52 మంది మహిళలు. మొత్తం 85 విభాగాల్లో వీరంతా పోటీపడుతున్నారు. ఈనెల 17న.. 90 మంది క్రీడాకారులు, ఆయా విభాగాల అధికారులు ప్రత్యేక విమానంలో టోక్యోకు బయలుదేరనుంది.
ఇదీ చూడండి: Modi: భారత అథ్లెట్లు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలి