ISl 2022: ఆడుతోంది మూడో సీజనే. తొలి రెండు సీజన్లలో ప్రదర్శన అంతంతమాత్రం. ఇలాంటి నేపథ్యం ఉన్న హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ ఈసారి ఇండియన్ సూపర్ లీగ్‌లో టైటిల్ ఎగరేసుకుపోతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు! కానీ ఆ జట్టు సంచలన ప్రదర్శనతో ఫైనల్ చేరి.. తుది పోరులోనూ అదరగొట్టి విజేతగా నిలిచింది. ఇండియన్ సూపర్ లీగ్ సీజన్-8లో ఆదివారం హోరాహోరీగా సాగిన ఆఖరి పోరులో హైదరాబాద్ పెనాల్టీ షూటౌట్లో 3-1తో కేరళ బ్లాస్టర్స్‌ను ఓడించింది. నిర్ణీత సమయంలో స్కోరు 1-1తో సమమైంది. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు ఆరంభం నుంచి దూకుడుగా ఆడాయి. బంతి నియంత్రణలో కేరళ (57 శాతం) కాస్త మెరుగ్గా ఉన్నా హైదరాబాద్ (43) కూడా అంతే దీటుగా ఆడడం వల్ల మ్యాచ్ రసవత్తరంగా సాగింది. కానీ తొలి అర్ధభాగంలో రెండు జట్లు తమ ప్రయత్నాలను గోల్స్‌గా మలచడంలో సఫలం కాలేకపోయాయి. విరామం తర్వాత రాహుల్ (68వ నిమిషం) చేసిన గోల్‌తో కేరళ ఆధిక్యంలోకి వెళ్లింది. దాదాపు ఆఖరి వరకు కేరళనే ముందంజలో ఉండడంతో ఆ జట్టే గెలిచేలా కనిపించింది. కానీ 88వ నిమిషంలో సాహిల్ గోల్ చేయడంతో స్కోర్లు సమమయ్యాయి. అదనపు సమయంలోనూ రెండు జట్లు గోల్స్ చేయకపోవడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు మళ్లింది.
షూటౌట్లో అతడే హీరో..
పెనాల్టీ షూటౌట్లో హైదరాబాద్ పైచేయి సాధించిందంటే గోల్‌కీపర్ లక్ష్మీకాంతే ప్రధాన కారణం. కళ్లుచెదిరే డైవ్‌లతో ప్రత్యర్థి ప్రయత్నాలను అడ్డుకున్న అతడు హైదరాబాద్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. షూటౌట్లో మొదట మార్కో లెస్కోవిచ్ (కేరళ) కొట్టిన షాట్‌ను లక్ష్మీకాంత్ అడ్డుకోగా.. ఆ తర్వాత షాట్‌ను జావో విక్టర్ (హైదరాబాద్) గోల్ చేసి జట్టును ఆధిక్యంలో నిలిపాడు. ఆపై నిషు (కేరళ), జావియర్ (హైదరాబాద్) గోల్స్ చేయలేకపోయారు. ఆ తర్వాత కేరళ ఆటగాడు ఆయూష్ గోల్ చేసి స్కోరు సమం చేయగా.. వెంటనే ఖాసా (హైదరాబాద్) బంతిని నెట్లోకి పంపి జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. ఆపై జాక్సన్ కొట్టిన షాట్‌ను హైదరాబాద్ గోల్‌కీపర్ లక్ష్మీకాంత్ ఎడమవైపు దూకుతూ ఆపాడు. ఆ వెంటనే హలిచరణ్ ప్రత్యర్థి గోల్‌కీపర్‌ను బోల్తా కొట్టించడం వల్ల షూటౌట్‌లో 3-1తో నెగ్గిన హైదరాబాద్ సంబరాల్లో మునిగిపోయింది. మూడోసారి ఫైనల్ ఆడిన కేరళకు మరోసారి నిరాశే మిగిలింది. 2014, 16 టోర్నీల్లోనూ ఫైనల్ చేరిన ఆ జట్టు ఏటీకే మోహన్‌బగాన్ చేతిలో ఓటమి చవిచూసింది. మరోవైపు గత రెండు సీజన్లలో 10, 5 స్థానాల్లో నిలిచిన హైదరాబాద్‌కు ఈసారి కప్ గెలవడం పెద్ద ఘనతే.
ఇదీ చదవండి: లక్ష్యసేన్‌కు నిరాశ.. ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ ఫైనల్లో ఓటమి