జపాన్‌లో కరోనా మహమ్మారి విజృంభణ దృష్ట్యా ఒలింపిక్స్ రద్దు చేయడమే మంచిదని టోక్యోలోని 6,000 మంది వైద్య నిపుణుల సంఘం దేశ ప్రధాని యోషిహిదె సుగ, టోక్యో గవర్నర్ యురికొ కోయ్కే, నిర్వాహకులకు లేఖ రాసింది. ప్రస్తుత పరిస్థితుల్లో టోక్యోలో ఒలింపిక్స్‌ను సురక్షితంగా నిర్వహించడం సాధ్యం కాదని వైద్య బృందం లేఖలో పేర్కొంది.
ఒలింపిక్స్, పారాలింపిక్స్ కోసం 15,000 క్రీడాకారులు.. 10,000 ఇతర సిబ్బంది టోక్యోకు రావడం ప్రమాదకరమని స్పష్టంచేసింది. దీని వల్ల కరోనా వ్యాప్తి చెంది ఘోరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఒలింపిక్స్ కోసం 10,000 మంది వైద్య సిబ్బంది, 500 నర్సులు, 200 కీడా వైద్య నిపుణుల అవసరం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. అయితే కరోనా మహమ్మారితో పోరాడుతున్న వైద్య సిబ్బంది ఇప్పటికే అలసిపోయారని.. అదనపు సిబ్బందిని కేటాయించడం అసాధ్యమని వైద్యుల సంఘం పేర్కొంది.
80 శాతం మందికి టీకాలు.. బాక్
ఒలింపిక్స్ ఆరంభ సమయానికి క్రీడాగ్రామంలో ఉండేవాళ్లలో 80 శాతం మందికి టీకాలు వేసే అవకాశముందని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాక్ తెలిపారు. అత్యంత సురక్షిత వాతావరణంలో టోక్యో ఒలింపిక్స్ జరుగుతాయని బాక్ భరోసా ఇచ్చారు. జులై 23న టోక్యోలో ప్రారంభంకానున్న ఒలింపిక్స్‌ను రద్దు చేయాలంటూ జపాన్ వైద్యుల సంఘం ఆందోనళ చేస్తున్న నేపథ్యంలో మొదలైన ఐఓసీ, మెగా క్రీడల నిర్వాహకుల మూడు రోజుల వర్చువల్ సమావేశంలో బాక్ ఈ వ్యాఖ్యలు చేశాడు.