స్టార్ హాకీ ప్లేయర్, ఒలింపిక్ కాంస్య పతక విజేత శ్రీజేష్ పీఆర్.. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. హాకీ స్టిక్‌ను తనతో పాటు విమానంలో తీసుకెళ్లేందుకు సదరు సంస్థ.. సాధారణ ఛార్జీ కన్నా ఎక్కువ మొత్తంలో వసూలు చేసిందని ట్వీట్ చేశాడు.
శ్రీజేష్.. తన షెడ్యూల్లో భాగంగా కొచిలో ఓ మ్యాచ్ ఆడేందుకు వెళ్లాల్సి ఉండగా.. అతడు దేవనహల్లి, కెంపెగౌడ ఎయిర్పోర్ట్ నుంచి ఇండిగో 6ఈ 382 విమానం ద్వారా ప్రయాణించాడు. అయితే తనతో పాటు 41 అంగులాల హాకీ స్టిక్‌ను కూడా తీసుకెళ్లాడు. అయితే ఫ్లైట్ ఎక్కేముందు అక్కడి సిబ్బంది.. నిబంధనల ప్రకారం 38 అంగలాల మించి హాకీ స్టిక్ పొడవు ఉన్నందున అదనపు ఛార్జీలు వసూలు చేశారు. చేసేదేమి లేక అతడు ఎక్స్ట్రా ఛార్జీ చెల్లించి తన గమ్యానికి చేరుకున్నాడు.
అయితే ఈ విషయాన్ని సోషల్‌మీడియాలో ట్వీట్ చేశాడు. "ఎఫ్ఐహెచ్ 41 అంగులాల పొడువున్న హాకీ స్టిక్ ఆడేందుకు అనుమతి ఇచ్చింది. కానీ ఇండిగో ఎయిర్‌లైన్స్ మాత్రం 38 అంగులాల మించి తీసుకెళ్లకూడదని.. నా హాకీ స్టిక్‌ను తీసుకెళ్లేందుకు నిరాకరించింది. ఏం చేయను? అదనంగా రూ.1500 చెల్లించి దాన్ని తీసుకెళ్లాల్సి వచ్చింది" అంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. దీనిపై సామాన్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా స్పందించారు. కొంతమంది అతడికి మద్దతుగా నిలవగా.. మరికొంతమంది మాత్రం నిబంధనలు అందరికీ వర్తిస్తాయి అని అంటున్నారు.
ఇదీ చూడండి: డీన్‌కు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చా: రనౌట్‌పై దీప్తి శర్మ వివరణ