భారత పారాలింపియన్ దేవేంద్ర జజారియా సత్తా చాటాడు. 40 ఏళ్ల ఈ రాజస్థాన్ ఆటగాడు జావెలిన్ త్రో (ఎఫ్-46)లో ప్రపంచ రికార్డు ప్రదర్శనతో టోక్యో పారాలింపిక్స్ బెర్తు సొంతం చేసుకున్నాడు. జాతీయ ట్రయల్స్‌లో జావెలిన్‌ను 65.71 మీటర్ల దూరం విసిరిన దేవేంద్ర.. తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డు (63.97 మీటర్లు)ను తిరగరాశాడు. ఆగస్టు 24న టోక్యో పారాలింపిక్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఈ క్రీడల్లో పాల్గొనడం దేవేంద్రకు ఇది మూడోసారి. 2004 ఏథెన్స్లో స్వర్ణం గెలిచిన అతడు.. 12 ఏళ్ల తర్వాత రియో క్రీడల్లో ప్రపంచ రికార్డు సృష్టిస్తూ పసిడి పతకం సొంతం చేసుకున్నాడు.
మరోవైపు ఆసియా పారా క్రీడల పసిడి పతక విజేతలు అమిత్‌కుమార్ సరోహా (డిస్కస్ త్రో, ఎఫ్-51), సందీప్ చౌదరి (జావెలిన్ త్రో, ఎఫ్-44) టోక్యో పారాలింపిక్స్ బెర్తు సాధించారు. రెండుసార్లు పారాలింపిక్స్ ఆడిన అమిత్ ఇటీవలే కరోనా బారిన పడి కోలుకున్నాడు. మొదట హాకీ ఆటగాడైన అమిత్ 22 ఏళ్ల వయసులో కారు ప్రమాదానికి గురై వెన్నెముక గాయంతో వికలాంగుడిగా మారాడు. ఆ తర్వాత పారా క్రీడల్లోకి వచ్చి డిస్కస్ త్రోను ఎంచుకున్నాడు. మరోవైపు సందీప్ చౌదరి (జావెలిన్ త్రో) కూడా టోక్యో పారాలింపిక్స్‌లో పోటీపడనున్నాడు. ట్రయల్స్‌లో అతడు జావెలిన్‌ను 66.44 మీటర్ల దూరం విసిరి టోక్యో బెర్తు సొంతం చేసుకున్నాడు.
అథ్లెటిక్స్‌లో 15 మంది..
టోక్యో ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లో భారత్ నుంచి 15 మంది అథ్లెట్లతో పాటు రెండు రిలే జట్లు పాల్గొంటున్నట్లు ప్రపంచ అథ్లెటిక్స్ సంఘం గురువారం అధికారికంగా వెల్లడించింది. నీరజ్ చోప్రా, శివ పాల్ సింగ్ (జావెలిన్), అవినాశ్ (3000 మీ. స్టీఫుల్‌చేజ్), ఇర్ఫాన్, సందీప్ కుమార్, రాహుల్, భావన, ప్రియాంక గోస్వామి (రేస్ వాకింగ్), శ్రీశంకర్ (లాంగ్‌జంప్), తేజిందర్ పాల్ (షాట్‌పుట్), కమల్‌ప్రీత్ కౌర్, సీమ పూనియా (డిస్కస్ త్రో), ద్యుతీ చంద్ (మహిళల 100 మీ., 200 మీ. పరుగు), అన్నురాణి (మహిళల జావెలిన్), ఎంపీ జబీర్ (పురుషుల 400 మీ. హర్డిల్స్)తో పాటు పురుషుల, 4x400 మీ. రిలే, మిక్స్డ్ 4x400 మీ. రిలే పరుగులో భారత జట్లు పాల్గొనబోతున్నాయి. ఇందులో ద్యుతి, అన్ను, జబిర్త్తో పాటు 4x400 మీటర్ల రిలే జట్టుకు మెరుగైన ర్యాంకింగ్ ద్వారా ఒలింపిక్ బెర్తులు లభించాయి.
ఇదీ చదవండి: Olympics: స్ప్రింటర్ ద్యుతీ చంద్‌కు ఒలింపిక్స్ బెర్త్