రానున్న టోక్యో ఒలింపిక్స్ గురించి భారత వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను మాట్లాడింది. తాను నేర్చుకోవాల్సిన విషయాలన్నీ దాదాపు రియో ఒలింపిక్స్ అప్పుడే తెలుసుకున్నానని చెప్పింది. ప్రస్తుత టోక్యో ఈవెంట్‌కు ముందు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లు పేర్కొంది.
2016 రియో ఒలింపిక్స్‌లో విఫలమైన తర్వాత తాను పూర్తిగా కుంగిపోయానని మీరాబాయి తెలిపింది. మానసిక వైద్యుడి సాయంతో తిరిగి కోలుకున్నట్లు పేర్కొంది. వెయిట్ లిఫ్టింగ్‌లో నేర్చుకోవాల్సిన టెక్నిక్‌లు, సంబంధిత అంశాలను అప్పుడే తెలుసుకున్నట్లు వెల్లడించింది.
"రియో ఒలింపిక్స్ ద్వారా చాలా అనుభవం వచ్చింది. నాకు తెలిసి, ఆ ఈవెంట్లో పాల్గొనడం ద్వారా దాదాపు అన్ని విషయాలపై అవగాహన వచ్చింది. నా బలహీనతలు గుర్తించగలిగాను. వాటిని ఎలా అధిగమించాలో తెలుసుకున్నాను. శిక్షణ, ప్రదర్శనలలో సొంతంగా ఎలా మెరుగవ్వాలో నాకు తెలిసొచ్చింది"
-మీరాబాయి చాను, భారత వెయిట్ లిఫ్టర్.
ఇదీ చదవండి: టీమ్ఇండియా టెస్టులు ఫిక్సింగ్.. స్పందించిన ఐసీసీ!
రియో ఒలింపిక్స్‌లో (48 కిలోలు) క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో ప్రభావం చూపలేకపోయింది మీరాబాయి. ఘోరంగా విఫలమయింది. కానీ, ఆ తర్వాత తనను తాను నిరూపించుకుంది. ఇటీవల జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్, కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణాలు గెలుచుకుంది.
భారత తొలి వెయిట్ లిఫ్టర్ కుంజరాణి దేవి నుంచి తాను ప్రేరణ పొందినట్లు మీరాబాయి వెల్లడించింది. మణిపూర్ నుంచి ప్రాతినిధ్యం వహించి గొప్ప వెయిట్ లిఫ్టర్‌గా పేరు ప్రఖ్యాతలు గాంచిందని తెలిపింది. తాను కూడా ఆమె లాగే చాలా పతకాలు కొల్లగొట్టాలని భావిస్తున్నానని పేర్కొంది. ఏదైనా సందేహం వచ్చినప్పుడు, లేదా ఒత్తిడిలో ఉన్నప్పుడు తన వీడియోలు చూస్తానని చాను వెల్లడించింది.
ఇదీ చదవండి: 'బాల్ టాంపరింగ్' వివాదంపై విచారణ హాస్యాస్పదం!