కొవిడ్ అనంతరం తిరిగి బాక్సింగ్ పోటీల్లో పాల్గొనడానికి మేరీ కోమ్ సిద్ధమైంది. మార్చి నెలలో స్పెయిన్ వేదికగా జరుగనున్న బాక్సమ్ ఇంటర్నేషనల్ టోర్నీలో రింగ్‌లోకి దిగనుంది.
ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన మేరీ.. మరో 8 మంది భారత అథ్లెట్లతో కలిసి టోక్యోకు వెళ్లనుంది. గత డిసెంబర్లో డెంగ్యూ బారిన పడిన ఈ స్టార్ బాక్సర్.. బరువు అధికంగా పెరిగిపోయింది. దీంతో ఫిట్నెస్ను సాధించేందుకు.. రెండు వారాల పాటు బెంగుళూరులోని జాతీయ క్యాంపులో చేరింది.
కొవిడ్ నేపథ్యంలో గతంలో విదేశాలకు వెళ్లడానికి నిరాకరించింది కోమ్. తాజాగా ఆ వ్యాఖ్యలపై స్పందించింది. "నేను భయపడ్డాను (ప్రయాణం చేయడానికి), నేను ఇప్పటికీ చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. కానీ, ఇలా ఎంత కాలం భయపడాలి? ఏదో ఒక సమయాన ఇది ఆగిపోవాలి. మహమ్మారి నుంచి రక్షణ పొందడానికి మన వంతు ప్రయత్నం చేయాలి" అని ఆమె అభిప్రాయపడింది.
రానున్న ఒలింపిక్స్ గురించి ప్రస్తావిస్తూ.. సవాళ్లకు తాను సిద్ధమని తెలిపింది. "బెంగుళూరులోని జాతీయ క్యాంపులో అందరిలో నేనే ముందున్నాను. టోక్యో ఒలింపిక్స్ గెలవడం సాధారణమైన విషయం కాదు. కానీ, అంచనాలకు మించి రాణిస్తానని మాత్రం చెప్పగలను. ఫలితం ఎలా ఉంటుందనేది మాత్రం నేను చెప్పలేను. నా చేతుల్లో ఏమీ లేదు" అని మేరీ తెలిపింది.
ఇదీ చదవండి: ఈసారి ఐపీఎల్‌కు వార్నర్ దూరం!