కరోనా లాక్‌డౌన్‌తో ప్రపంచవ్యాప్తంగా స్థంబించిన క్రీడా రంగం.. ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. మన దేశంలో సెప్టెంబరు లేదా, అక్టోబరులో తిరిగి టోర్నీలు నిర్వహించే అవకాశముందని కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వైరస్ సంక్షోభ పరిస్థితుల్లో ఆ టోర్నీలు ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయని అన్నారు.
"కొన్ని పరిమితులతో క్రీడా కార్యకలాపాలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఆ ప్రత్యేక నిబంధనలను ప్రతి క్రీడా సంఘం అనుసరించాల్సిందే. ఇటీవల ఒలింపిక్ కోటా అథ్లెట్ల కోసం ప్రత్యేక శిబిరాలను మొదలు పెట్టామని చెప్పేందుకు సంతోషిస్తున్నా. ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాల్సి ఉంది. సెప్టెంబరు లేదా అక్టోబరు నుంచి దేశంలో టోర్నీలు ప్రారంభం అవతాయనే నమ్మకం ఉంది. వివిధ క్రీడలకు సంబంధించిన పెద్ద లీగ్‌లు ఆరంభమయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి" అని కామన్వెల్త్ దేశాల మంత్రుల ఫోరమ్ సమావేశంలో రిజిజు పేర్కొన్నారు.