హాకీ ప్రపంచకప్‌లో పతకం కోసం దశాబ్దాల ఎదురుచూపులకు తెరదించాలని భారత హాకీ జట్టు భావిస్తోంది. స్వదేశంలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక హాకీ ప్రపంచకప్‌లో ఈ సారి పతకం సాధించాలని పట్టుదలగా ఉంది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించిన ఇండియా హాకీ జట్టు హాకీ ప్రపంచకప్‌లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. శుక్రవారం స్పెయిన్‌తో జరిగే తొలి మ్యాచ్‌లో గెలిచి కొత్త ఏడాదినిఈ మెగా టోర్నమెంట్‌ను విజయంతో ప్రారంభించాలని పట్టు దలగా ఉంది. హాకీ ప్రపంచకప్‌లో 1971లో భారత జట్టు కాంస్యం గెలుచుకోగా.. 1973లో రజతం.. 1975లో స్వర్ణం సాధించింది. 1975లో చిరకాల ప్రత్యర్థి పాక్‌ను ఓడించి మరీ భారత టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత మళ్లీ హాకీ ప్రపంచకప్‌లో భారత్ పతకాన్ని సాధించలేదు. ఈసారి ఈ మెగా టోర్నీ స్వదేశంలో జరుగుతుండడంతో 48 ఏళ్ల సుదీర్ఘ ఎదురుచూపులకు పతకంతో చెక్ పెట్టాలని హర్మన్‌ప్రీత్ సింగ్ సేన పట్టదలగా ఉంది.
గతంతో పోలిస్తే భారత హాకీ జట్టు ఇప్పుడు టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా పోటీ పడుతోంది. హర్మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని జట్టు ఇటీవల బలమైన జట్లపై చిరస్మరణీయ విజయాలు సాధించింది. ప్రస్తుతం ప్రపంచ ర్యాకింగ్స్‌లో ఆరో స్థానంలో ఉన్న భారత జట్టు తొలి స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాపై ఇటీవల అద్భుతమైన ప్రదర్శన చేసింది. ఆస్ట్రేలియాకు చెందిన గ్రహం రీడ్ శిక్షణలో రాటు దేలిన భారత జట్టు ఒలింపిక్స్‌లోనూ సత్తా చాటింది. మరోసారి అలాంటి ప్రదర్శనే చేయాలని భావిస్తోంది. రీడ్ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి..భారత జట్టు ఆటలో సమూల మార్పులు వచ్చాయి. ఈ ప్రపంచకప్‌లోనూ టీమిండియా సత్తా చూపుతుందని రీడ్ ధీమా వ్యక్తం చేశారు.
సారథి, అత్యుత్తమ డ్రాగ్ ఫ్లికర్‌లలో ఒకడైన హర్మన్‌ప్రీత్ సింగ్... భారత జట్టుకు కీలకంగా మారనున్నాడు. గోల్ కీపర్ శ్రీజేష్, మన్‌ప్రీత్ సింగ్ హార్దిక్ సింగ్, మన్‌దీప్ సింగ్‌లు ఫామ్‌లో ఉండడం భారత జట్టుకు కలిసి రానుంది. మాజీ సారథి అమిత్ రోహిదాస్, ఆకాష్‌దీప్ సింగ్‌లపై భారత్ ఆశలు పెట్టుకుంది. స్పెయిన్‌తో జరుగుతున్న మ్యాచ్‌ను విజయంతో ప్రారంభించి ఫూల్ డీలో అగ్రస్థానంలో ఉండాలని చూస్తోంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఎనిమిదో స్థానంలో ఉన్న స్పెయిన్ జట్టు కూడా చాలా పటిష్టంగా ఉంది. ఆ జట్టులో అందరూ యువకులే ఉండడం మైదానంలో వేగంగా కదలడం ఆ జట్టుకు ప్రధాన బలంగా మారింది. హాకీ ప్రపంచకప్‌లో 1971, 1998ల్లో రన్నరప్‌గా నిలిచిన స్పెయిన్ 2006లో కాంస్య పతకం సాధించింది. ఇప్పటివరకూ స్పెయిన్- భారత్ మధ్య 30 మ్యాచ్‌లు జరగగా 13 మ్యచ్‌లలో భారత్.... 11 మ్యాచ్‌ల్లో స్పెయిన్ గెలవగా.. 6 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.
ఇదీ చూడండి: IND VS SL: అదరగొట్టిన కుల్దీప్.. లంక బ్యాటర్లు విలవిల