Hockey pro league: హాకీ ప్రొ లీగ్‌లో భారత అమ్మాయిలు, అబ్బాయిల జట్లు అద్భుత విజయాలను అందుకున్నాయి. శనివారం తొలుత వెనకబడి తర్వాత స్పెయిన్‌పై గెలుపు రుచి చూశాయి. పురుషుల జట్టు ఓటమి తప్పదనుకున్న మ్యాచ్‌లో అసాధారణంగా పోరాడి 5-4తో గెలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ (4వ స్థానం) కంటే ర్యాంకింగ్స్‌లో వెనకున్న స్పెయిన్ (9వ) ఒక దశలో 4-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆరంభం నుంచి నువ్వానేనా అన్నట్టుగా పోరాడిన స్పెయిన్ 14వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను సద్వినియోగం చేసి ఖాతా తెరిచింది. ఆ తర్వాత 18 సెకన్లకే భారత్ గోల్ కొట్టింది. హర్మన్‌ప్రీత్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు. రెండో క్వార్టర్‌లో భారత పేలవ డిఫెన్స్‌ను స్పెయిన్ సొమ్ము చేసుకుంది. ఆ జట్టు కెప్టెన్ మార్క్ మిరాల్స్ (20వ, 23వ) మూడు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసి ఆతిథ్య జట్టును ఒత్తిడిలోకి నెట్టాడు. ఆ తర్వాత 40వ నిమిషంలో మరో గోల్‌తో హ్యాట్రిక్ చేసిన అతడు జట్టుకు 4-1 ఆధిక్యం అందించాడు. అక్కడి నుంచి భారత్ దూకుడు మొదలైంది. మూడో క్వార్టర్ ముగిసే లోపు భారత్ రెండు గోల్స్ కొట్టి స్పెయిన్ ఆధిక్యాన్ని తగ్గించింది. శిలానంద్ లక్రా (41వ), షంషేర్ సింగ్ (43వ) గోల్స్ సాధించారు. ఆఖరి క్వార్టర్‌లోనూ భారత్ జోరు తగ్గలేదు. వరుస దాడులు చేసి పెనాల్టీ కార్నర్‌లను సంపాదించింది. వరుణ్ కుమార్ (55వ నిమిషం) గోల్‌తో భారత్ 4-4తో స్కోరును సమం చేసింది. మరో 4 సెకన్లలో మ్యాచ్ ముగుస్తుందనగా లభించిన పెనాల్టీ స్ట్రోక్‌ను గోల్ కొట్టి హర్మన్‌ప్రీత్ జట్టును గెలిపించాడు.
వరుసగా మూడో విజయం
హాకీ ప్రొ లీగ్‌లో భారత అమ్మాయిల జైత్రయాత్ర కొనసాగుతోంది. జట్టు వరుసగా మూడో విజయాన్ని అందుకుంది. శనివారం మ్యాచ్‌లో భారత్ 2-1 తేడాతో బలమైన స్పెయిన్‌ను చిత్తుచేసింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో ఉన్న ప్రత్యర్థిపై తొమ్మిదో స్థానంలో ఉన్న భారత్ ఆధిపత్యం చలాయించింది. మన జట్టు తరపున జ్యోతి (20వ నిమిషంలో), నేహ గోయల్ (52వ) చెరో ఫీల్డ్ గోల్ కొట్టారు. ప్రత్యర్థి జట్టులో నమోదైన ఏకైక గోల్‌ను మార్టా సెగు (18వ నిమిషంలో) చేసింది. ఆదివారం మరోసారి స్పెయిన్‌తో భారత్ ఆడనుంది.
ఇదీ చూడండి: Russia Ukraine War: రష్యాపై క్రీడా యుద్ధం