తుర్కియే, సిరియాలను భారీ భూకంపం వణికించింది. భూకంపం ధాటికి వందలాది భారీ భవనాలు కుప్పకూలిపోయాయి. దీంతో రెండు దేశాల్లో 5000 పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది ఇకా శిథిలాల కింద చిక్కుకుపోయారు. వీరితో పాటు శిథిలాల కింద ప్రముఖ ఘనా ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియన్ అట్సు త్వాసం(christian atsu twasam) చిక్కుకుపోయాడు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ వచ్చి.. అట్సును శిథిలాల నుంచి సురక్షితంగా బయటకు తీసింది. ఆ తర్వాత ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం అట్సు ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఘనాకు చెందిన రేడియో సంస్థ తెలిపింది. 'మీకు ఒక గుడ్‌న్యూస్. మాకు అందిన సమాచారం ప్రకారం ఘనా స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియన్ అట్సు ప్రాణాలతో ఉన్నారు. అతడిని క్షేమంగా శిథిలాల నుంచి బయటకు తీశారు. భూకంపం సంభవించిన తుర్కియేలోని సదరన్ ప్రావిన్స్ ఆఫ్ హటేలో అతడు ఉంటున్న భవవం కూలిపోయింది. దీంతో శిథిలాల కింద అట్సు చిక్కుకున్నాడు.'' అని ఒక పోస్టు పెట్టింది. దీంతో పాటు ఘనా ఫుట్‌బాల్ అసోషియేషన్ కూడా స్పందించింది. "మాకు ఒక పాజిటివ్ న్యూస్ వచ్చింది. అట్సుని సురక్షితంగా రెస్క్యూ చేశారు. ఇప్పుడు అతడికి చికిత్స అందుతోంది. అట్సు కోలుకోవాలని కోరుకుందాం" అని సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది.
కాగా, ఫుట్‌బాలర్ అట్సు ప్రస్తుతం 'టర్కిష్ సూపర్ క్లబ్ హట్సేపోర్'కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ ప్లేయర్ గతంలో 'చెల్సియా ఫుట్‌బాల్ క్లబ్'కు కూడా ప్రాతినిధ్యం వహించాడు. న్యూక్యాసిల్‌కు ఐదేళ్ల పాటు ఆడాడు. ఆ తర్వాత 2021లో సౌదీ అరేబియా క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అయితే, ఇటీవలే టర్కీష్ ఫుట్‌బాల్ క్లబ్‌కు మారాడు. మరోవైపు, ఘనా తరపున 65 మ్యాచ్‌లాడిన అట్సూ 9 గోల్స్ చేశాడు. కాగా, సోమవారం తెల్లవారుజామున సంభవించిన ఈ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 7.8 నమోదైనట్లు యూకే జియోగ్రాఫికల్ సర్వీస్ పేర్కొంది. భూకంపం ధాటికి పలు భారీ భవనాలు కుప్పకూలిపోయినట్లు తెలిపారు. భూకంపం కారణంగా అనేక ఇళ్లు కూలి.. దాదాపు 5 వేల మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఇంకా వేలాది మంది శిథిలాల కిందే ఉన్నట్లు అధికారులు తెలిపారు.