Boxer died heartattack in ring: జర్మనీకి చెందిన బాక్సర్ ఛాంపియన్ ముసా యమక్(38) హఠాన్మరణం చెందాడు. బాక్సింగ్ రింగ్‌లో ఇప్పటిదాకా ఓటమన్నదే ఎరుగని ఆ దిగ్గజ బాక్సర్‌ను మృత్యువు ఓడించింది.
మునిచ్ నగరంలో జరిగిన పోటీల్లో ముసా యమక్.. ఉగాండాకు చెందిన హంజా వాండెరాతో తలపడ్డాడు. ఈ పోరు రెండో రౌండ్లో ప్రత్యర్థి విసిరిన పంచ్ యమక్ను బలంగా తాకింది. అయినా తట్టుకుని నిలబడిన అతడు.. మూడో రౌండ్ కొన్ని సెకన్లలో ప్రారంభమవుతుందనగా గుండెపోటుకు గురయ్యాడు. రింగ్‌లోనే కుప్పకూలిపోయాడు. వెంటనే డాక్టర్లు ప్రాథమిక చికిత్స అందించి ఆస్పత్రికి తరలించారు. అయినా ఫలితం దక్కలేదు. అప్పటికే అతడు కన్నుమూసినట్లు వైద్యులు నిర్ధరించారు. కాగా, అతడి ఆకస్మిక మరణంతో బాక్సింగ్ వర్గాల్లో విషాదం నెలకొంది.
2017లో ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారిన ముసా యమక్ ఇప్పటివరకు ఆడిన 8 ప్రొఫెషనల్ బౌట్లలోనూ గెలిచాడు. అన్ని విజయాలు కూడా ప్రత్యర్థిని నాకౌట్ చేయడం ద్వారానే సాధించాడు. 2021లో వరల్డ్ బాక్సింగ్ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ టైటిల్ గెలిచి మరింత గుర్తింపును సాధించాడు.
ఇదీ చూడండి: బీసీసీఐ కీలక నిర్ణయం!.. ఐపీఎల్ ఫైనల్లో మార్పు.. కారణమదేనా?