జంటనగరాల్లో కురిసిన కుండపోత వర్షం వర్ధమాన షూటర్ల భవిష్యత్తును అయోమయంలోకి నెట్టింది! పేద క్రీడాకారులకు ఉచితంగా శిక్షణ ఇవ్వాలన్న మంచి ఉద్దేశంతో ఒలింపియన్ గగన్ నారంగ్ కొనుగోలు చేసిన షూటింగ్ సామగ్రి పూర్తిగా నీళ్ల పాలయింది. తిరుమల్‌గిరిలోని నారంగ్‌కు చెందిన 'గన్ ఫర్ గ్లోరీ' అకాడమీ వరద నీటిలో మునిగిపోయింది. అందులో భద్రపరిచిన 90 రైఫిళ్లు, పిస్టళ్లలో నీళ్లు చేరాయి. సుమారు రూ.1.3 కోట్ల సొంత ఖర్చుతో జర్మనీ నుంచి నారంగ్ వీటిని తెప్పించాడు.
నవంబరు 1న గచ్చిబౌలీ షూటింగ్ రేంజ్‌లో ప్రారంభించాలనుకున్న అకాడమీ కోసం ఈ సామాగ్రిని కొనుగోలు చేశాడు గగన్. ఈ రైఫిళ్లు, పిస్టళ్లను ఒక్కసారి కూడా ఉపయోగించలేదంటూ 'ఈనాడు'తో వాపోయాడు.
"తెలంగాణ రాష్ట్రం నుంచి షూటింగ్ ఛాంపియన్లను తయారు చేయాలన్న నా కలపై వరుణుడు నీళ్లు చల్లాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అకాడమీ కోసం తొమ్మిదేళ్లు కష్టపడ్డ మా బృందానికి తీవ్ర నిరాశ కలుగుతోంది."
గగన్‌నారంగ్, ప్రముఖ షూటర్
"గచ్చిబౌలి షూటింగ్ రేంజ్‌లో అకాడమీ కోసం రెండు నెలల క్రితమే జర్మనీ నుంచి సామగ్రి తెప్పించా. ఒక్కసారి కూడా ఉపయోగించలేదు. మంగళవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లేసరికి అకాడమీ 8 అడుగుల నీటిలో మునిగిపోయింది. ఎంత ప్రయత్నించినా షెటర్ తెరుచుకోలేదు. సుమారు రూ.1.3 కోట్లు విలువ చేసే 90 రైఫిళ్లు, పిస్టళ్లు నీటిలో మునిగిపోయాయి. ప్రస్తుతం వాటిని ఆరబెట్టాం. అందులో ఎన్ని పని చేస్తాయో.. ఎన్ని పాడవుతాయో తెలియదు. ఇలాంటి విపత్తు వస్తుందని ఊహించలేదు కాబట్టి బీమా చేయించలేదు" అంటూ గగన్ ఆవేదన వ్యక్తం చేశాడు.