టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన అనంతరం నీరజ్ చోప్డా ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. అమ్మాయిల్లో అయితే క్రేజ్ మామూలుగా లేదు. అతడి ఇష్టాఇష్టాలు, ఏం చేస్తుంటాడు అనే విషయాలపై చాలా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఏమాత్రం ఖాళీ దొరికినా తనకెంతో ఇష్టమైన కార్లు, బైకులపై షికార్లకు వెళుతుంటాడట నీరజ్. అతడి దగ్గరున్న వాహనాలపై ఓ లుక్కేయండి.
బజాజ్ పల్సర్ 220 ఎఫ్: సంపాదన మొదలైన తర్వాత సొంత డబ్బులతో కొనుక్కున్న మొదటి బైక్ ఇది. సొంతూరు పానిపట్ నుంచి దిల్లీకి ఈ బండిపైనే వందలసార్లు చక్కర్లు కొట్టానంటాడు. దానిపై జావెలిన్ త్రో విసురుతున్న తన రేడియం స్టిక్కర్ అతికించుకున్నాడు. 220సీసీ సామర్థ్యం, రూ.లక్షన్నర ఖరీదు ఉండే ఈ టూవీలర్ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ద్విచక్రవాహనాల్లో ఒకటి.
హార్లీ డేవిడ్‌సన్ 1200 రోడ్‌స్టర్: ఏషియన్ గేమ్స్‌లో పతకం గెలిచిన తర్వాత ఈ క్రూజర్‌ని సొంతం చేసుకున్నాడు. 1202సీసీ ఈ బండి సొంతం. 180 కిలోమీటర్ల టాప్‌స్పీడ్‌తో వెళ్తుంది. ధర రూ.12లక్షలు.
ఆడీ క్యూ5: నీరజ్ దగ్గరున్న కార్లలో అత్యంత ఖరీదైంది ఇదే. ధర రూ.60లక్షలు. దిల్లీలో ఉన్నప్పుడు ఎక్కువగా ఈ కారునే వాడుతుంటాడు. 1,960 సీసీ, 222 బీహెచ్‌పీ ఇంజిన్‌తో పని చేస్తుంది.
టయోటా ఫార్చునర్: కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం నెగ్గిన తర్వాత తనకొచ్చిన నజరానాలతో ఈ కారును తన గ్యారేజీకి తీసుకొచ్చాడు. ధర రూ.35లక్షలు. 2,755సీసీతో దూసుకెళ్తుంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ 700: ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచినందుకు మహీంద్రా అండ్ మహీంద్రా అధిపతి ఆనంద్ మహీంద్రా నీరజ్‌కి ఇచ్చిన నజరానా. ఏడు సీట్ల కారు. కుటుంబంతో ఎక్కడికెళ్లినా దీన్నే ఉపయోగిస్తానన్నాడు నీరజ్.
ఇదీ చూడండి: ప్రపంచ అథ్లెటిక్స్ ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపిన నీరజ్