FIH Hockey pro league: ఎఫ్‌ఐహెచ్ హాకీ ప్రొ లీగ్‌లో తమ అరంగేట్ర సీజన్‌లో సత్తాచాటుతున్న భారత అమ్మాయిలకు కఠిన పరీక్ష ఎదురవుతోంది. శుక్రవారం ఆరంభమయ్యే రెండంచెల పోరులో ఒలింపిక్ ఛాంపియన్ నెదర్లాండ్స్‌తో జట్టు తలపడుతుంది. ప్రపంచ నంబర్‌వన్ అయిన ప్రత్యర్థి ఈ పోటీల కోసం ద్వితీయ శ్రేణి జట్టును పంపినప్పటికీ దాన్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. టోక్యోలో పసిడి గెలిచిన నెదర్లాండ్స్ జట్టులోని క్రీడాకారిణులెవ్వరూ ఇప్పుడు పోటీపడడం లేదు. అయినప్పటికీ మొత్తం కొత్త అమ్మాయిలతో నిండిన జట్టు ఈ లీగ్‌లో ఇప్పటివరకూ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో 17 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత్ ఆరు మ్యాచ్‌ల్లో 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. చివరగా ఒలింపిక్స్‌లో ఈ రెండు జట్లు పోటీపడగా భారత్ 1-5 తేడాతో ఓడింది.
ఇప్పుడు సొంతగడ్డపై మన అమ్మాయిలు నెదర్లాండ్స్‌ను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. మరోవైపు సీనియర్ క్రీడాకారిణి రాణి రాంపాల్ గాయం నుంచి కోలుకుని ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండడం శుభ పరిణామం. కానీ ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక టోర్నీలు ఉన్న నేపథ్యంలో ఆమెను ఈ రెండు మ్యాచ్‌ల పోరు కోసం మైదానంలోకి దించుతారా? అన్నది సందేహంగా మారింది. రాణితో చర్చించాక కోచ్ ఓ నిర్ణయం తీసుకుంటుందని కెప్టెన్ సవిత తెలిపింది. ‘‘నెదర్లాండ్స్ ప్రపంచ నంబర్‌వన్ జట్టు. ఇప్పుడు స్వదేశంలో ఆ జట్టుతో తలపడే అవకాశం రావడంతో అమ్మాయిలు ఉత్తేజితంగా ఉన్నారు. ప్రధాన క్రీడాకారిణులు లేకపోయినప్పటికీ బలంగా ఉన్న ప్రత్యర్థిని తేలిగ్గా తీసుకోకూడదు. ఈ ఏడాది ప్రపంచకప్, ఆసియా క్రీడల్లాంటి ప్రధాన టోర్నీలు రాబోతున్నాయి కాబట్టి రాణిపై ఒత్తిడి పెంచాలనుకోవడం లేదు. ఆమె ఇప్పుడు ఆడాలా? లేదా? అనేది కోచ్ నిర్ణయిస్తుంది’’ అని సవిత పేర్కొంది.
ఇదీ చూడండి: IPL 2022: దంచికొట్టిన డికాక్.. దిల్లీపై లఖ్‌నవూ ఘన విజయం