దాదాపు రెండు దశాబ్దాలుగా ఫుట్‌బాల్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన దిగ్గజాలు మెస్సి, రొనాల్డో చివరి ప్రపంచకప్ ఆడేశారు! ఆటపై చెరగని ముద్ర వేసిన వీళ్లు.. అంతర్జాతీయ ప్రయాణానికి ముగింపు పలికే దిశగా సాగుతున్నారు. నెయ్‌మార్‌లో మునుపటి దూకుడు లోపించింది. ఇక ఆటలో.. కొత్త సూపర్‌స్టార్ ఎవరు? అద్భుతమైన నైపుణ్యాలతో మాయ చేసేది ఎవరు? అనే ప్రశ్నలకు జవాబుగా ఎంబాపె కనిపిస్తున్నాడు. నాలుగేళ్ల కిత్రం రష్యాలో సంచలన ప్రదర్శనతో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో ఆగమనాన్ని ఘనంగా చాటిన అతను.. ఇప్పుడు ఖతార్‌లో అత్యధిక గోల్స్‌తో ప్రపంచ అగ్రశ్రేణి ఆటగాడిగా నిలబడ్డాడు. ఇది తన శకమే అని సగర్వంగా చాటాడు.
1998.. ఫ్రాన్స్ మొట్టమొదటి సారి సాకర్ విశ్వవిజేతగా నిలిచిన సంవత్సరమది. ఆ ఏడాదే మరో ప్రత్యేకత కూడా ఉంది. అద్భుతమైన ఆటతీరుతో, చిన్న వయసులోనే ప్రపంచ అగ్రశ్రేణి ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా ఎదిగిన కిలియన్ ఎంబాపె అప్పుడే పుట్టాడు. 23 ఏళ్లు.. అయిదు దేశవాళీ టైటిళ్లు.. 250కి పైగా కెరీర్ గోల్స్.. రెండు ప్రపంచకప్ ఫైనల్స్ (2018లో విజేత, 2022లో రన్నరప్).. ఇవీ ఎంబాపె ఘనతలు. మైదానంలో చిరుత వేగంతో.. బంతిపై గొప్ప నియంత్రణతో.. లక్ష్యం తప్పని గురితో.. జట్టు విజయాల్లో అతను కీలకంగా మారాడు.
బ్రెజిల్, జర్మనీ లాంటి శక్తిమంతమైన ఫుట్‌బాల్ దేశాల సరసన ఇప్పుడు ఫ్రాన్స్ సగర్వంగా నిలిచిందంటే అందుకు అతడు కూడా ఓ ప్రధాన కారణం. గత మూడు దశాబ్దాల్లో ప్రపంచకప్‌ల్లో అత్యుత్తమ ప్రదర్శన ఫ్రాన్స్‌దే. 1998లో కప్పు గెలిచిన ఆ జట్టు.. 2006 ఫైనల్లో ఓడింది. 2018లో ఛాంపియన్‌గా నిలిచింది. ఈ సారి చివరి మెట్టుపై బోల్తాపడింది. గత 24 ఏళ్లలో నాలుగు ఫైనల్స్‌లో తలపడింది. నాలుగేళ్ల క్రితం నాలుగు గోల్స్‌తో జట్టు టైటిల్ సాధించడంలో ఎంబాపె ముఖ్య భూమిక పోషించాడు. ఆ టోర్నీలో ఉత్తమ యువ ఆటగాడిగానూ నిలిచాడు. ఈ సారి ఏకంగా 8 గోల్స్‌తో ‘బంగారు బూటు’ అందుకున్నాడు.
తిరుగులేని ఆటగాడిగా..: ఆటపై ప్రేమతో, విజయాల కాంక్షతో ఎంబాపె క్రమంగా వృద్ధి సాధిస్తూనే ఉన్నాడు. ఫైనల్లో మెస్సి ఆట కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూశారో.. ఎంబాపె మెరుపుల కోసమూ అంతే ఎగబడ్డారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ మెగా టోర్నీలో ఆకర్షణలో, ఆటలో మెస్సీకి దీటుగా నిలిచిన ఆటగాడు అతడే. అత్యుత్తమ ఫిట్‌నెస్, దూసుకెళ్లే వేగం, ప్రత్యర్థులను ఢీ కొట్టి నిలబడే ధైర్యం, బంతిని గోల్‌పోస్టులోకి చేర్చేంతవరకూ పట్టు వదలని నైజం ఈ అటాకర్‌ను తిరుగులేని ఆటగాడిగా మార్చాయి.
ఫైనల్లో 80 నిమిషాల వరకు అర్జెంటీనా 2-0తో సాగుతుంటే.. ఆ జట్టుదే విజయమని అందరూ అంచనాకు వచ్చేశారు. ఫ్రాన్స్ ఒక్క గోలైనా కొట్టగలదా? అని ఆ దేశ అభిమానులతో పాటు ఆటగాళ్లూ చూస్తున్నారు. సహచర ఆటగాళ్లు అప్పటికే ఢీలా పడిపోయారు. కానీ ఎంబాపె ఆగలేదు. పోరాటాన్ని ఆపలేదు. అవకాశం కోసం ఎదురు చూసిన అతను 97 సెకన్లలోనే రెండు గోల్స్‌తో దేశపు ఆశలు నిలిపాడు. అదనపు సమయంలోనూ జట్టు వెనకబడ్డ దశలో మరో పెనాల్టీ గోల్‌తో మ్యాచ్‌ను షూటౌట్‌కు తీసుకెళ్లాడు. అందులోనూ బంతిని లక్ష్యానికి చేర్చాడు. కానీ మిగతా ఆటగాళ్లు, గోల్‌కీపర్ అంచనాల మేర రాణించలేకపోవడంతో ఓటమి తప్పలేదు. దీంతో నిరాశతో మైదానంలో కూలిపోయాడు. ఆ క్షణం అతడితో పాటు ఫుట్‌బాల్ ప్రపంచమూ బాధ పడింది. ఆ వీరుడి పోరాటానికి సలాం కొట్టింది.
వలస కుటుంబం..: ఎంబాపె తల్లిదండ్రులిద్దరూ క్రీడాకారులే. కామెరూన్ నుంచి శరణార్థిగా పారిస్ శివారులోని బాండీకి వచ్చిన విల్‌ఫ్రైడ్ ఎంబాపె ఫుట్‌బాల్ ఆడేవాడు. ఆ తర్వాత కోచ్‌గా మారాడు. అల్జీరియాకు చెందిన అతని భార్య ఫైజా ఒకప్పటి హ్యాండ్‌బాల్ క్రీడాకారిణి. ఇరుకు గదుల్లో, పేదరికంలో పెరిగిన ఎంబాపె చిన్నప్పటి నుంచే ఫుట్‌బాల్‌పై ఇష్టం పెంచుకున్నాడు. చదువు కంటే కూడా ఆటకే విలువ ఎక్కువ అని నమ్మి కొడుకును విల్‌ఫ్రైడ్ ప్రోత్సహించాడు. అతనే ఆటలో ఓనమాలు నేర్పాడు.
తాను పనిచేసే ఏఎస్ బాండీ క్లబ్‌లో ఎంబాపెను ఆడించాడు. క్రమంగా ఆటపై పట్టు సాధించిన అతను మొదట్లో రెండేళ్ల పాటు మొనాకోకు ఆడాడు. 2017లో పారిస్ సెయింట్ జెర్మైన్ (పీఎస్‌జీ) క్లబ్‌తో చేరాడు. మంచి దేహ ధారుఢ్యం అతణ్ని మిగతా ఆటగాళ్లకు భిన్నంగా నిలుపుతోంది. అతను స్పెయిన్ దిగ్గజ క్లబ్ రియల్ మాడ్రిడ్‌కు మారకుండా పీఎస్‌జీతోనే కొనసాగేలా చూడడం కోసం స్వయంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ జోక్యం చేసుకున్నారంటే ఎంబాపె విలువ ఏమిటో అర్థమవుతోంది. దేశం ఆశలను, అంచనాలను భుజాలపై మోస్తూ తీవ్ర ఒత్తిడిలోనూ అతను రాణిస్తున్న వైనం అసాధారణం. సహజంగా అబ్బిన నైపుణ్యాలతో, మానసికంగానూ దృఢంగా ఉంటూ సత్తాచాటుతున్నాడు.
మైదానంలో తన వేగంతో అబ్బురపరుస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం ప్రపంచకప్‌లో 19 ఏళ్ల వయసులో అతని ప్రదర్శన సంచలనాన్ని సృష్టించింది. ఇప్పుడు అదే నిలకడతో అదరగొట్టి ఇప్పటికే స్టార్‌గా ఎదిగిన అతడు.. ఇదే జోరుతో సాగితే భవిష్యత్ దిగ్గజంగా మారడం ఖాయం!. ఇక ఈ ప్రపంచకప్‌లో ఎంబాపె గోల్స్ 8 . 23 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయసులో ఓ ప్రపంచకప్‌లో ఇన్ని గోల్స్ చేసిన ఆటగాడు ఎంబాపె ఒక్కడే. జేమ్స్ రోడ్రిగ్జ్ (2014), మారియో కెంప్స్ (1978), పీలే (1958) ఆరేసి గోల్స్ సాధించారు.