Fifa world cup భారత క్రీడా రంగానికి, ఫుట్‌బాల్ అభిమానులకు తీపి కబురు. బయటి వ్యక్తుల ప్రభావం ఎక్కువగా ఉందనే కారణంతో అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్)పై విధించిన నిషేధాన్ని అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) ఎత్తివేసింది. ఫిఫా డిమాండ్లకు తగ్గట్లుగా ఏఐఎఫ్‌ఎఫ్ చర్యలు తీసుకోవడంతో ఈ నిషేధం తొలగిపోయింది. పాలకుల కమిటీ (సీఓఏ)ను సుప్రీం కోర్టు రద్దు చేయడం, సమాఖ్యపై నియంత్రణ ఏఐఎఫ్‌ఎఫ్ చేతికి రావడంతో ఫిఫా బ్యూరో మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 11 నుంచి 30 వరకు అండర్-17 అమ్మాయిల ప్రపంచకప్ భారత్‌లోనే జరుగుతుంది.
"ప్రణాళిక ప్రకారం ఫిఫా అండర్-17 మహిళల ప్రపంచకప్ అక్టోబర్ 11-30 తేదీల్లో భారత్‌లోనే జరుగుతుంది. బ్యూరో మండలి ఏఐఎఫ్‌ఎఫ్‌పై నిషేధాన్ని తక్షణమే తొలగించాలని నిర్ణయించింది. ఏఐఎఫ్‌ఎఫ్‌కు ఎన్నికల నిర్వహణపై తదుపరి చర్యల గురించి త్వరలోనే చర్చిస్తాం. ఫిఫా, ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఎఫ్‌సీ) ఈ పరిస్థితిని సమీక్షిస్తూనే ఉంటాయి. ఎన్నికలు సజావుగా సాగేలా ఏఐఎఫ్‌ఎఫ్‌కు మద్దతుగా నిలుస్తాయి" అని ఫిఫా ఓ ప్రకటనలో తెలిపింది. ఏఐఎఫ్‌ఎఫ్‌కు కొత్త నియమావళి ఏర్పాటుతో పాటు ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా సుప్రీం కోర్టు గతంలో సీఓఏను నియమించింది. అది సమర్పించిన నియమావళి ముసాయిదాలో, ఎన్నికల నిర్వహణలో ఫిఫా కొన్ని అభ్యంతరాలు లేవనెత్తింది. కానీ సీఓఏ పట్టించుకోకపోవడంతో బయట వర్గం ప్రభావం ఎక్కువగా ఉందనే కారణంతో ఈ నెల 16న ఏఐఎఫ్‌ఎఫ్‌పై ఫిఫా నిషేధం విధించింది. అండర్-17 ప్రపంచకప్‌ను భారత్‌లో నిర్వహించబోమని తెలిపింది. దీంతో ఈ నిషేధాన్ని తొలగించేలా రంగంలోకి దిగిన కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి మేరకు సీఓఏను సుప్రీం కోర్టు రద్దుచేసింది. వచ్చే నెల 2కు వాయిదా పడ్డ ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మొదలైంది.
ఇదీ చూడండి: మళ్లీ చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా, తొలి భారత్ అథ్లెట్‌గా