క్రీడల్లో రాణించేందుకు అవకాశం రావడమే గొప్ప.. ఎంతో క్రమశిక్షణ, నిబద్ధత, పట్టుదల ఉంటేగాని అందులో పేరు తెచ్చుకోవడం సాధ్యం కాదు. ఒకవేళ ఆ అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకునేది కొందరే. అందులోనూ దీర్ఘకాలంగా రాణించేది ఇంకా తక్కువ. ఇక చెరగని రికార్డులతో తమ పేర్లను చరిత్రలో లిఖించికునే క్రీడాకారులు వేళ్ల మీద లెక్కపెట్టుకోవచ్చు. ఇలా మరపురాని ప్రదర్శన, నిలిచిపోయే రికార్డులతో అద్భుతాలను సృష్టించిన కొంతమంది క్రీడా దిగ్గజాల గురించి ఇప్పుడు చూద్దాం...
సచిన్ తెందూల్కర్..
ఈ పేరు వింటే భారత అభిమానులు రక్తం ఉప్పొంగుతుంది. క్రికెట్ బ్యాట్ పట్టుకుని మైదానంలోకి అడుగుపెడుతుంటే కళ్లన్నీ అతడివైపే ఉండేవి. ఒకటి కాదు రెండు కాదు 24ఏళ్ల పాటు భారత క్రికెట్ ప్రస్థానంలో హెల్మెట్ పెట్టుకున్న యోధుడిలా పోరాడాడు. 5 అడుగుల 6 అంగుళాల ఎత్తున్న సచిన్ ఘనత ఎవరెస్టును అధిగమించింది. 34వేల అంతర్జాతీయ పరుగులు, వంద సెంచరీలు, 164 అర్ధశతకాలతో ఇప్పుడప్పుడే ఎవరు దరి చేరని స్థాయికి ఎదిగాడు. ఇందులో 18, 426 వన్డే పరుగులు, 15,921 టెస్టు పరుగులున్నాయి.
![5 players Who make Some Amazing World Records Which Prove Their Greatness in their sport](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3839437_sachin-tendulkar.jpg)
మైకేల్ ఫెల్ప్స్...
బంగారు చేపగా పేరుగాంచాడు అమెరికా ఈతగాడు మైకేల్ ఫెల్ప్స్ . అతడి స్మిమ్మింగ్ చూస్తే సముద్రం మీద నడిచి వెళ్తున్నాడా అని అనిపిస్తుంది. మొత్తం 28 ఒలింపిక్ పతకాలు గెల్చుకున్న ఫెల్ప్స్...ఇప్పటివరకు అత్యధిక మెడల్స్ సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇందులో 23 స్వర్ణాలున్నాయి.
![few players Who make Some Amazing World Records Which Prove Their Greatness in their sport](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4913596_phelp.jpg)
15 ఏళ్ల వయసులో తొలిసారి 2000లో సిడ్ని ఒలింపిక్స్‌లో ఫెల్ఫ్స్ పోటీపడ్డాడు. అయితే అప్పుడు పతకం గెలవలేకపోయాడు. ఆ పరాభవం అతడిలో కసిని పెంచింది. ఫలితంగా 2004 ఏథేన్స్‌లో జరిగిన విశ్వక్రీడల్లో ఆరు స్వర్ణాలతో దూసుకెళ్లాడు. రెండు కాంస్యాలనూ సొంతం చేసుకున్నాడు. 2008 బీజింగ్ క్రీడల్లో తన విజయ ప్రస్థానం శిఖరాన్ని తాకింది. 8 స్వర్ణాలతో అదరగొట్టేశాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లోనూ 4 స్వర్ణాలు, 2 రజతాలు కైవసం చేసుకున్నాడు. 2016 రియోలోనూ 5 స్వర్ణాలు, ఓ రజతంతో విశ్వక్రీడల ప్రస్థానాన్ని దిగ్విజయంగా ముగించాడు.
సిమోన్ బైల్స్...
22ఏళ్ల అమెరికా జిమ్నాస్టిక్ సిమోన్ బైల్స్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. వయసు తక్కువైనా.. అరుదైన రికార్డులు అందుకుంటోంది. జిమ్నాస్టిక్స్‌లో ప్రపంచ ఛాంపియన్‌గా(2013-15, 2018-19), వరల్డ్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ ఛాంపియన్(2013-15, 2018-19) ఐదేసి సార్లు పతకాలు అందుకుంది. ఆరుసార్లు యూఎస్ జాతీయ ఆల్‌రౌండ్ ఛాంపియన్‌గానూ(2013-16, 2018-19) నిలిచింది. ఇటీవల జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లోనూ సత్తాచాటి కెరీర్లో 24వ మెడల్‌ను సొంతం చేసుకుంది. ఈ విజయంతో వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో ఎక్కువ పతకాలు గెలిచిన జిమ్నాస్టిక్ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది.
![few players Who make Some Amazing World Records Which Prove Their Greatness in their sport](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/lead_720_405_0910newsroom_1570589382_1067.jpg)
ఇయాన్ మిల్లర్..
ఒలింపిక్స్‌లో ఒక్కసారైనా పాల్గొనాలనేది ప్రతి ఒక్క ఆటగాడి చిరకాల కల. అలాంటింది ఏకంగా పది సార్లు విశ్వక్రీడల్లో పోటీపడిన వ్యక్తి గురించి తెలుసా? అతడే.. కెనడా షో జంపింగ్(హార్స్ జంపింగ్) క్రీడాకారుడు ఇయాన్ మిల్లర్. మొదటి సారి 1972 ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొన్న మిల్లర్.. 2012 వరకు 10సార్లు పోటీపడ్డాడు. చివరికి 2008 బీజింగ్ విశ్వక్రీడల్లో రజతం నెగ్గి.. పతకం గెలవాలనే చిరకాల కల నెరవేర్చుకున్నాడు.
![](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4913596_athlet.jpg)
కరీమ్ అబ్దుల్ జబ్బర్..
బాస్కెట్ బాల్ క్రీడా ప్రస్థానంలో దిగ్గజం అమెరికా ఆటగాడు కరీమ్ అబ్దుల్ జబ్బర్ ముందు వరసలో ఉంటాడు. ప్రతిష్టాత్మక జాతీయ బాస్కెట్‌బాల్ అసోసియేషన్(ఎన్బీఏ) లీగ్‌లో 20ఏళ్ల పాటు అత్యధిక పాయింట్లు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 1969 నుంచి 1989 వరకు సగటున గేమ్‌కు 24.6 పాయింట్లతో టాప్‌లో నిలిచాడు. మొత్తం తన కెరీర్లో 38,387 పాయింట్లు ఖాతాలో వేసుకొని సంచలనం సృష్టించాడు. తన చివరి రెండు గేముల్లో సగటున 15 పాయింట్లు సాధించినప్పటికీ అతడి యావరేజీ తగ్గకపోవడం విశేషం.
![](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4913596_athlet2.jpg)
వీళ్లే కాకుండా మహ్మద్ అలీ, సర్ డాన్ బ్రాడ్‌మన్, ధ్యాన్‌చంద్, లాంటి క్రీడకారులు విశ్వవ్యాప్తంగా ఎందరో ఉన్నారు.