ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023లో డిఫెండింగ్ ఛాంపియన్ రఫేల్ నాదల్‌కు చుక్కెదురైంది. మరోసారి టైటిల్ సాధించాలని బరిలోకి దిగిన నాదల్ రెండో రౌండ్‌లోనే వెనుదిరిగాడు. దీంతో 23వ గ్రాండ్‌స్లామ్‌ను తన ఖాతాలో వేసుకుందామని భావించిన నాదల్ ఆశలకు కళ్లెం పడింది.
కాగా, తాజా మ్యాచ్‌లో తుంటి గాయంతో ఇబ్బంది పడుతున్న రఫేల్ నాదల్ తన అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించలేకపోయాడు. రెండో సెట్ జరుగుతున్న సమయంలోనే నొప్పితో బాధపడుతూ మెడికల్ టైమ్ ఔట్ తీసుకొన్నాడు. అలా అమెరికాకు చెందిన మెకంజీ మెక్‌డొనాల్డ్ చేతిలో 6-4, 6-4, 7-5 తేడాతో నాదల్ ఓడిపోయాడు. దీంతో గత ఏడాది కాలంలో నాలుగుసార్లు అమెరికా ఆటగాళ్ల చేతిలో భంగపాటుకు గురయ్యాడు నాదల్. ఫ్రాన్సిస్ టియాఫో (యూఎస్ ఓపెన్ 2022 రెండో రౌండ్), టామీ పాల్ (పారిస్ మాస్టర్స్ 2022, తొలి రౌండ్), టేలర్ ఫ్రిట్జ్ (ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ గ్రూప్ స్టేజ్)పై ఓటమి చెందాడు. మరోవైపు మహిళల టెన్నిస్‌లో నంబర్‌వన్ ర్యాంకర్ ఇగా స్వేటెక్ సులువుగా మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లింది. కొలంబియాకు చెందిన కామిలా ఒసోరియాపై 6-2, 6-3 తేడాతో స్వేటెక్ విజయం సాధించింది.
ఇదీ చూడండి: ODI rankings: దూసుకెళ్లిన కోహ్లీ, సిరాజ్.. అదే జరిగితే పాక్ కెప్టెన్ బాబర్‌కు ఎసరే!