కంప్యూటర్ల రాకతో గత కొన్నేళ్లలో ఆటగాళ్లు చదరంగం ఆడే విధానమే పూర్తిగా మారిపోయిందని విశ్వనాథన్ ఆనంద్ చెప్పాడు. బోర్డుకు ఇరువైపులా ఇద్దరు ప్లేయర్లు కూర్చొని తలపడడం ఒక్కటే మారలేదని అతనన్నాడు.
"నాకు ఆరేళ్ల వయసపుడు నా సోదరుడు, సోదరి చెస్ ఆడుతుండడం చూశా. నాక్కూడా ఆట నేర్పించమని అప్పుడు అమ్మని అడిగా. ఆటలో నేను సాధించిన ప్రగతి వెనక కొన్నేళ్ల కష్టం దాగి ఉంది. 1980ల్లో నేను చెస్ నేర్చుకున్నప్పటికీ ఇప్పటికీ ఆటలో చాలా మార్పులు వచ్చాయి. కంప్యూటర్ల రాకతో ఆడే విధానం మారిపోయింది. ఆట గురించి అధ్యయనం చేయడం సులువైంది. కానీ బోర్డు ముందు ఆటగాళ్లు కూర్చుని ఆడడం మాత్రం మారలేదు. చెస్ అంటే కేవలం బోర్డు మీద గెలవడం మాత్రమే కాదు. ప్రత్యర్థి ఆలోచనల మీద దెబ్బకొట్టడం చాలా ముఖ్యం. మెరుగైన ఎత్తులు వేశామని అందరూ అనుకుంటారు. కానీ బోర్డుపై చివరి తప్పు ఎవరు చేశారనేది ప్రధానం. నీ ఆట ఆడుతూనే అవతలి వ్యక్తి ఎత్తులను ఊహించాలి".
-- విశ్వనాథన్ ఆనంద్, చెస్ ఆటగాడు
గేమ్ ఆడిన తర్వాత ఒత్తిడిని తగ్గించుకోవడానికి జిమ్‌కు వెళ్తానని అన్నాడు. తన కెరీర్‌లో 1987 ప్రపంచ జూనియర్, 2017 ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్‌షిప్ విజయాలు ఎంతో ప్రత్యేకమైనవని ఆనంద్ పేర్కొన్నాడు.
ఇదీ చూడండి... మరపురాని మెరుపులు: సూపర్‌హిట్.. సచిన్ అప్పర్కట్