ఆన్లైన్ చెస్ ఒలింపియాడ్ మ్యాచ్‌ల సమయంలో విద్యుత్, ఇంటర్నెట్ ఇబ్బందులు తలెత్తకుండా కోనేరు హంపి, విదిత్ గుజరాతీలకు అదనపు వసతులు కల్పించాలని నిర్ణయించింది అఖిల భారత చెస్ సమాఖ్య(ఏఐసీఎఫ్). వారిద్దరికీ తమ సొంత నగరాల్లోనే ఫైవ్‌స్టార్ హోటల్లో గదులు కేటాయించనుంది. ఆదివారం చైనాపై విజయంతో పూల్-ఏ అగ్రస్థానంలో నిలిచిన భారత్.. క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది.
మంగోలియాతో జరిగిన ఆరో రౌండ్ పోరులో హంపి, విదిత్‌లు.. ఇంటర్నెట్, విద్యుత్ సరఫరా సమస్యలు ఎదుర్కొన్నారు. దీంతో మిగతా మ్యాచ్‌లను నక్షత్ర హోటల్ నుంచి ఆడాలని ఏఐసీఎఫ్ సూచించింది. అయితే కరోనా మహమ్మారి నేపథ్యంలో హోటల్లో ఉండేందుకు హంపి నిరాకరించింది.
"మిగతా మ్యాచ్‌లు హోటల్ నుంచి ఆడొచ్చని హంపి, విదిత్‌లతో సహా ఆందరికీ చెప్పాం. అయితే వారంతా ఇంటి నుంచి ఆడేందుకే మొగ్గుచూపారు." అని ఏఐసీఎఫ్ కార్యదర్శి భరత్‌సింగ్ చౌహాన్ తెలిపారు.
"మంగోలియాతో మ్యాచ్‌కు ముందురోజు రాత్రంతా వర్షం కురిసింది. విత్యుత్ సరఫరాలో ఏర్పడిన అంతరాయాన్ని అధికారులు సరిచేశారు. అయితే, ఇంటర్నెట్ పనిచేయకపోవడం వల్ల ఇబ్బంది తలెత్తింది. ప్రస్తుత పరిస్థితుల్లో హోటల్లో ఉంటలేను" అని హంపి వివరించింది. విదిత్ కూడా ఒకటి లేదా రెండ్రోజుల్లో తన నిర్ణయాన్ని చెప్తానని స్పష్టం చేశాడు.