Chess Olympiad 2022 Team India: ప్రపంచ వ్యాప్తంగా 150కి పైగా దేశాలు పోటీపడే అత్యంత ప్రతిష్ఠాత్మక చదరంగ యుద్ధం.. చెస్ ఒలింపియాడ్‌కు భారత్ సిద్ధమవుతోంది. స్వదేశంలో జులై 28న ఆరంభమయ్యే ఈ టోర్నీ కోసం ఓపెన్, మహిళల విభాగాల్లో రెండేసి జట్ల చొప్పున భారత్ మహాసేనను ప్రకటించింది. ఆతిథ్య హోదాలో ఒక్కో విభాగంలో రెండు జట్లను బరిలో దింపే అవకాశాన్ని సొంతం చేసుకున్న మన దేశం.. ఇలా ఒకే ఒలింపియాడ్ కోసం నాలుగు బృందాలను పోటీల్లో నిలపడం ఇదే తొలిసారి. దీంతో 14 రోజుల పాటు సాగే ఈ టోర్నీలో భారత పతకావకాశాలు మెరుగయ్యాయి. ఈ జట్లలో తెలుగు గ్రాండ్‌మాస్టర్ల సంఖ్య ఎక్కువగానే ఉంది. అర్జున్ ఇరిగేశి, హరికృష్ణ, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక వివిధ జట్ల తరపున ప్రాతినిథ్యం వహించనున్నారు. ఓపెన్ విభాగంలో ఇండియా- ఎ జట్టులో విదిత్ గుజరాతి, హరికృష్ణ, అర్జున్, ఎస్ఎల్ నారాయణన్, శశికిరణ్.. ఇండియా- బి తరపున నిహాల్ సరీన్, గుకేశ్, అధిబన్, ప్రజ్ఞానంద, రౌనక్ సాధ్వాని బరిలో దిగుతారు. మహిళల ఇండియా- ఎ జట్టులో హంపి, హారిక, వైశాలి, తనియా సచ్దేవ్, భక్తి కులకర్ణి.. ఇండియా- బి లో వంతిక, సౌమ్య, మేరీ ఆన్ గోమ్స్, పద్మిని, దివ్య చోటు దక్కించుకున్నారు.
19 ఏళ్ల తెలంగాణ కుర్రాడు అర్జున్ గత కొంత కాలంగా నిలకడగా అద్భుత ప్రదర్శన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తొలిసారి ఒలింపియాడ్‌లో పోటీపడబోతున్న అతనిపై మంచి అంచనాలున్నాయి. హంపి, హారిక ద్వయంతో మహిళల ‘ఎ’ జట్టు బలంగా కనిపిస్తోంది. ఒకే ఒలింపియాడ్‌లో దేశానికి ప్రాతినిథ్యం వహించనున్న రెండో సోదర, సోదరీమణి జోడీగా వైశాలి (అక్క), ప్రజ్ఞానంద (తమ్ముడు) నిలిచారు. అంతకుముందు 1988లో సరిత, సుధాకర్ భారత్‌కు ఆడారు. మరోవైపు యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో పోటీలకు దూరంగా ఉన్న దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్.. ఈ జట్లకు మార్గనిర్దేశకుడిగా వ్యవహరిస్తాడు. శ్రీనాథ్, ఆర్బీ రమేశ్, అభిజిత్, స్వప్నిల్ వివిధ జట్లకు కోచ్‌లుగా ఎంపికయ్యారు. జీఎం ప్రవీణ్ తిప్సే భారత బృందానికి నాయకత్వం వహించనున్నాడు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా ఈ టోర్నీ వర్చువల్‌గా జరిగిన సంగతి తెలిసిందే. 2020లో రష్యాతో కలిసి ఉమ్మడి విజేతగా నిలిచిన భారత్.. 2021లో మహిళల విభాగంలో కాంస్యం గెలిచింది. "ఈ రోజుల్లో నేను కొన్ని టోర్నీలు మాత్రమే ఆడుతున్నా. ఇప్పటికే చాలా ఒలింపియాడ్లు ఆడిన నాకు ఇప్పుడు యువ ఆటగాళ్ల సమయం వచ్చిందనిపించింది. నిహాల్, ప్రజ్ఞానంద, అర్జున్ లాంటి చాలా మంది ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లు భారత్‌కు ఉన్నారు" అని ఆనంద్ తెలిపాడు.
ఇదీ చూడండి: అమ్మది చైనా.. నాన్నది రొమేనియా.. పుట్టింది కెనడాలో.. ఆడేది బ్రిటన్‌కు...!