ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలన్న భారత షట్లర్లు సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ ఆశలు ఆవిరయ్యాయి. వారికున్న దారులన్నీ మూసుకుపోయినట్లైంది!. ఇప్పటికే మలేసియా ఓపెన్‌ను వాయిదా వేసిన ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య(బీడబ్ల్యూఎఫ్).. ఇప్పుడు సింగపూర్ ఓపెన్(2021)ను రద్దు చేసింది. ఈ విషయాన్ని సింగపూర్ బ్యాడ్మింటన్ అసోసియేషన్(ఎస్బీఏ), బీడబ్ల్యూఎఫ్ సంయుక్తంగా ప్రకటించాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నాయి.
"ఆటగాళ్ల ఆసక్తి, ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ ఈవెంట్‌ను రద్దు చేస్తున్నాం. ఈ టోర్నీని రీషెడ్యూల్ చెయ్యం" అని ప్రకటించింది. ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ నిర్వహణ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని బీడబ్ల్యూఎఫ్ తెలిపింది. దీంతో సైనా, శ్రీకాంత్‌కు ఉన్న ఒక్క అవకాశం కూడా చేజారిపోయినట్టే! అయితే టోక్యో ఒలింపిక్స్ సింగిల్స్ విభాగంలో భారత షట్లర్లు పీవీ సింధు, సాయి ప్రణీత్.. డబుల్స్‌లో చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్ అర్హత సాధించారు.
ఇదీ చూడండి: భారత షట్లర్ల కోసం బాయ్ ప్రత్యేక ఏర్పాట్లు