అనారోగ్యం బారిన పడితేనే జీవితంలో ఏదో కోల్పోయినట్లు బాధపడేవాళ్లు చాలమంది ఉన్నారు. కేన్సర్ లాంటి ప్రాణాంతకర వ్యాధులైతే ఈ భయం ఇంకా ఎక్కువ ఉంటుంది. కానీ అమెరికా స్విమ్మర్ సారా థామస్ కేన్సర్‌ను జయించడమే కాదు.. ఇంగ్లీష్ ఛానల్‌ను ఏకంగా నాలుగు సార్లు ఈది రికార్డు సృష్టించింది. ఎక్కడా ఆగకుండా ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకుంది.
ఆదివారం మొదలు పెట్టిన ఆమె నాలుగో ప్రయాణాన్ని ఆపకుండా మంగళవారానికి పూర్తి చేసింది. మొత్తం 84 మైళ్లను (135 కిలో మీటర్లు) 54 గంటల్లో ఈదింది సారా.
"నేను పూర్తి చేశానంటే నమ్మలేకపోతున్నా. జీవితాంతం నాకు ఓ మధుర జ్ఞాపకంగా ఇది మిగిలిపోతుంది. వేసే ప్రతి అడుగు ఎంతో కష్టంగా అనిపించింది" -సారా థామస్, స్విమ్మర్
2017 నవంబరులో రొమ్ము కేన్సర్ బారిన పడిన సారా.. చికిత్స కోసం ఏడాది పాటు ఈతకు దూరంగా ఉంది. అనంతరం కేన్సర్‌ను జయించి పునరాగమనం చేసింది. ఆమె ఏడాదిలోనే ఈ ఘనత అందుకోవడం విశేషం.
ఇంగ్లాండ్ - ఫ్రాన్స్‌ను వేరు చేసే ఇంగ్లీష్ ఛానల్‌ను ఇప్పటివరకు నలుగురు స్విమ్మర్లు మాత్రమే ఎక్కడా ఆగకుండా మూడు సార్లు ఈదారు. అయితే నాలుగో సారి కూడా దిగ్విజయంగా పూర్తి చేసింది సారా.
ఇదీ చదవండి: పాక్ ఆటగాళ్లకు బిర్యానీ, మాంసం కట్