డ్యాన్స్ చేసి ఒలింపిక్స్ పతకం సాధించవచ్చా? సంగీతానికి అనుగుణంగా కాళ్లు కదుపుతూ.. శరీరాన్ని తిప్పితే ఆ మెగా క్రీడల పోడియంపై నిలబడొచ్చా? మరో నాలుగేళ్లలో ఇది నిజం కాబోతోంది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో బ్రేక్‌డ్యాన్స్‌ను క్రీడాంశంగా చేర్చడమే అందుకు కారణం. మరి ఆ పోటీ ఎలా ఉండబోతోంది? విజేతలను ఎలా నిర్ణయిస్తారో? తెలుసా?
2018 యూత్ ఒలింపిక్స్‌తోనే మొదలు..
అగ్రశ్రేణి క్రీడాకారులు.. అత్యుత్తమ అథ్లెట్‌లు.. దిగ్గజ ఆటగాళ్లు పోటీపడే ఒలింపిక్స్‌లో బ్రేక్ డ్యాన్సర్లు కూడా పతకం కోసం తలపడే దృశ్యాలు 2024 ఒలింపిక్స్‌లో కనబడనున్నాయి. 2018 యూత్ ఒలింపిక్స్‌లో ఈ బ్రేక్ డ్యాన్స్‌ను క్రీడాంశంగా తొలిసారి ప్రవేశపెట్టారు. అప్పుడది విజయవంతం కావడం వల్ల 2024 ఒలింపిక్స్‌లో నిర్వహించాలని నిర్ణయించారు.
స్వర్ణం దక్కాలంటే!
ఈ క్రీడాంశంలో 32 మంది బ్రేకర్స్ (డ్యాన్సర్లు) పోటీపడతారు. అందులో 16 మంది చొప్పున పురుషులు, మహిళలు ఉంటారు. రెండు రోజులుగా సాగే ఈ పోటీల్లో తొలి రోజు ప్రిలిమ్స్, రెండో రోజు ఫైనల్స్ నిర్వహిస్తారు. ఇద్దరు డ్యాన్సర్లు పరస్పరం పోటీపడాల్సి ఉంటుంది. హిప్ హాప్ శైలిలో నిర్వహించే ఆ పోటీని 'బ్యాటిల్స్' అంటారు. టెక్నిక్, వైవిధ్యం, ప్రదర్శన, సంగీతానికి అనుగుణంగా, సృజనాత్మకత, శరీరాన్ని కదిలించే తీరు.. ఇలా ఈ ఆరు విషయాలను పరీక్షించి న్యాయ నిర్ణేతల బృందం విజేతలను ఎంపిక చేయనుంది. ఒకేసారి ఇద్దరు బ్రేకర్స్ తలపడినపుడు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని తమ నైపుణ్యాలను ప్రదర్శించాల్సి ఉంటుంది. బ్రేకర్లు అప్పటికప్పుడు అక్కడ వినిపించే సంగీతానికి అనుగుణంగా కాళ్లు కదుపుతారు. ప్రత్యర్థులుగా తలపడే ఇద్దరూ.. తొలి మూడు రౌండ్లలో వేర్వేరు సంగీతానికి డ్యాన్స్ చేయాలి. చివరి రౌండ్లో మాత్రమే ఒకే రకమైన సంగీతానికి స్టెప్పులేయాలి. ఇద్దరిలో ఎవరు మంచి ప్రదర్శన చేస్తే వాళ్లు ముందంజ వేస్తారు. ఇలా చివరకు ఫైనల్లో నెగ్గిన వాళ్లకు స్వర్ణం దక్కుతుంది.