తమ పిల్లలను ఆటల వైపు నడిపించే తల్లిదండ్రులుంటారు. ఆటలెందుకు? దెబ్బలు తగులుతాయి. బుద్ధిగా చదువుకోవాలంటూ వ్యతిరేకించే అమ్మానాన్నలూ ఉంటారు. ఇంట్లో వాళ్లు వద్దన్నారని ఎంతో మంది తమకిష్టమైన ఆటలను వదులుకుంటారు. పూజ కూడా అలాగే చేసి ఉంటే ఇప్పుడు ఆమె గురించి మనం ఇలా చెప్పుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. బాక్సింగ్‌లో శిక్షణ తీసుకుంటానంటే తండ్రి ఒప్పుకోక పోయినా.. కుటుంబ సభ్యులు వద్దన్నా.. ఆమె వినలేదు. ఆటలో సత్తాచాటి తన నైపుణ్యాలను వాళ్లకు చాటి చెప్పాలనుకుంది. అందుకే ఇంట్లో తెలీకుండా శిక్షణ కొనసాగించింది. జాతీయ స్థాయిలో విజయాలతో వెలుగులోకి వచ్చింది. బాక్సింగ్ ఎందుకు అన్న వాళ్లతోనే చప్పట్లు కొట్టించింది. ఆటలో కొనసాగమని చెప్పేలా చేసింది. ఆమె హరియాణాకు చెందిన 30 ఏళ్ల పూజ. ఆలస్యంగానే ఆటలో అడుగుపెట్టినప్పటికీ.. అద్భుత ప్రదర్శనతో సాగుతోంది.
అలా గ్లోవ్స్‌తో..
కళాశాలలో చేరిన తర్వాతే పూజ బాక్సింగ్ వైపు అడుగులు వేసింది. అది కూడా అనుకోకుండా జరిగింది. పూజ ఎత్తుగా ఉండడం వల్ల కళాశాలలోని ఓ ప్రొఫెసర్ భార్య ఆమెను బాక్సింగ్ ఎంచుకోమని పట్టుబట్టింది. కానీ గ్లోవ్‌లు వేసుకోవడం అసౌకర్యంగా అనిపించడం వల్ల మొదట్లో సందేహించింది. కానీ ఆమెకు.. ఆ ప్రొఫెసర్ భార్య గ్లోవ్‌లు ఎలా వేసుకోవాలో నేర్పించింది. అప్పుడు అలా చేతులకు గ్లౌవ్‌లు వేసుకున్న పూజ.. ఇప్పుడు ప్రత్యర్థులపై విరుచుకుపడుతోంది. ఆ తర్వాత తనకు బాక్సింగ్‌పై ప్రేమ త్వరగానే పుట్టింది. ఇక అదే లోకమైంది. కానీ కుటుంబ సభ్యులు అందుకు ఒప్పుకోకపోవడం వల్ల తీవ్ర నిరాశ చెందింది. పోలీస్ అయిన ఆమె తండ్రి బాక్సింగ్ చేసేందుకు అంగీకరించలేదు. అది దూకుడైన ఆట కాబట్టి గాయాలయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, అలా అయితే తన కూతురి పెళ్లికి ఇబ్బంది అవుతుందని భావించిన అతను.. పూజ ఇష్టాన్ని నిరాకరించాడు. కానీ ఆమె మాత్రం వాళ్లకు తెలీకుండా రహస్యంగా శిక్షణ కొనసాగించింది. శిక్షణలో గాయాలైతే.. అవి ఇంట్లో వాళ్లకు కనిపించకుండా జాగ్రత్త పడేది. మరీ పెద్ద దెబ్బలు తగిలితే.. అది తగ్గే దాకా ఇంటికి వెళ్లకుండా కోచ్ లేదా స్నేహితుల దగ్గర ఉండేది. ఇంట్లో ఆ గాయాలు చూస్తే తనను బాక్సింగ్‌కు దూరం చేస్తారని ఆమె భయం, అలా ఆరు నెలలు గడిచిపో యాయి. బాక్సింగ్‌లో ఆమె పట్టు సాధించింది. 2006లో జాతీయ యూత్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌గా నిలిచింది. కోచ్ వచ్చి ఆమె తల్లిదండ్రులతో మాట్లాడడం వల్ల.. ఆ విజయం తర్వాత పూజ ఆటలో కొనసాగేందుకు తల్లిదండ్రులు అనుమతించారు.
గాయాలను దాటి..
వేగంగా దూసుకెళ్లిన పూజ కెరీర్‌కు మధ్యలో గాయాలు కళ్లెం వేశాయి. ఆసియా ఛాంపియన్షిప్ 2012లో రజతం, 2015లో కాంస్యం సాధించిన ఆమె.. 2014 ఆసియా క్రీడల్లో కంచు పతకం గెలిచింది. అయితే అగ్రశ్రేణి బాక్సర్‌గా ఎదిగే దిశగా సాగుతున్న ఆమె ప్రయాణంలో గాయాలు అడ్డంకిగా మారాయి. 2016, 2017లో ప్రమాదకరమైన గాయాలతో పోరాడిన తను ఆత్మవిశ్వాసంతో వాటి నుంచి కోలుకుంది. భుజం గాయం నుంచి బయటపడి తిరిగి రింగ్‌లో అడుగుపెట్టి మునుపటి దూకుడు అందుకునేందుకు శ్రమించింది. 2019 ఆసియా ఛాంపియన్షిప్ 81 కేజీల విభాగంలో స్వర్ణంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. అయితే టోక్యో ఒలింపిక్స్‌లో ఆ విభాగం లేకపోవడం వల్ల 75 కేజీల కేటగిరీకి మారాలని నిర్ణయించుకుంది. ఆ దిశగా బరువు తగ్గించుకునేందుకు శ్రమించింది. నిరుడు లాక్‌డౌన్‌కు ముందు ఆసియా- ఓషియానియా జోన్ ఆర్హత టోర్నీలో సత్తాచాటి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత మహిళా బాక్సర్‌గా నిలిచింది. ఈ ఏడాది జులై 8వ ఆరంభం కానున్న ఒలింపిక్స్‌కు ముందు చివరి ప్రధాన టోర్నీ అయిన ఆసియా ఛాంపియన్‌షిప్‌లో పసిడి చేజిక్కించుకున్న ఆమె.. టోక్యోలో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించే దిశగా సాగుతోంది.
ఇదీ చూడండి: అదరగొట్టిన బాక్సర్ పూజ- మరోసారి స్వర్ణం