ఆసియన్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ బజరంగ్ పునియా స్వర్ణాన్ని చేజిక్కించుకున్నాడు. చైనా జియాన్ వేదికగా జరుగుతన్న ఫైనల్లో కజకిస్థాన్‌కు చెందిన ఒకసోవ్పై 12-7 తేడాతో గెలిచాడు. పురుషుల 65 కేజిల విభాగంలో పోటీపడిన బజరంగ్ రెండో సారి ఈ ఛాంపియన్‌షిప్‌లో పసిడిని పొందాడు. 2017లో తొలిసారి ఈ ఘనత సాధించాడు బజరంగ్.
మ్యాచ్ ప్రారంభంలో 2-7తో వెనకంజలో ఉన్న పునియా అనంతరం ఎటాకింగ్‌కు దిగాడు. కేవలం 60 సెకన్లలోనే 8 పాయింట్లు సాధించాడు. వరుసగా 10 పాయింట్ల నెగ్గి ప్రత్యర్థికి మరో అవకాశమివ్వలేదు బజరంగ్. కజకిస్థాన్ ఆటగాడు ఒకసోవ్పై ఒత్తిడి పెంచి సత్తా చాటాడు బజరంగ్.
మరో భారత రెజ్లర్ పర్వీన్ రానా ఫైనల్ చేరాడు. 79 కేజీల విభాగంలో కజకిస్థాన్‌కు చెందిన ఉస్సెర్బియేవ్పై 3-2 తేడాతో గెలిచి స్వర్ణంపై కన్నేశాడు. ఫైనల్లో ఇరాన్‌కు చెందిన మొహమ్మద్ తెయ్మూరితో తలపడనున్నాడు. ఈ టోర్నీలో భారత్ ఇప్పటికే ఐదు పతకాలు గెలుచుకుంది.