వైకల్యాన్నే ఓడించి.. పారాలింపిక్స్‌లో విజేతగా అవతరించింది అవని లేఖరా (Avani Lekhara). టోక్యో పారాలింపిక్స్‌లో (Tokyo Paralympics) స్వర్ణపతకాన్ని గెల్చుకుంది. అయితే తను విజయతీరాలని తాకడానికి ఆమె తల్లి శ్వేత, కోచ్ సుమ పడిన శ్రమ చిన్నదేం కాదు.. అందుకేనేమో పతకం సాధించగానే చేసిన మొదటి పని వాళ్లిద్దరికీ థ్యాంక్స్ చెప్పింది. టోక్యోలో ఉన్న శ్వేత, సుమ.. ఈనాడుకు ఇచ్చిన పత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
"నేను, మా వారు ప్రవీణ్‌కుమార్ ప్రభుత్వోద్యోగులం. మాది జయపుర. మాకో బాబు, పాప అవని. తను చాలా చురుకైంది. స్కూల్‌లో ఏ ఫంక్షన్ జరిగినా తన డ్యాన్స్ ప్రోగ్రాం ఉండి తీరాల్సిందే. అంత బాగా డ్యాన్స్ చేస్తుంది. అప్పటికి అవనికి 11 ఏళ్లు ఉంటాయి. స్కూల్ ఫంక్షన్‌లో తను డ్యాన్స్ చేసింది. తిరిగి తీసుకురావడానికి కారులో వెళ్లాం. వస్తూ ఉండగా కారు అదుపు తప్పింది. గాల్లోనే మూడు పల్టీలు కొట్టి సమీపంలోని పొలాల్లో పడింది. మేం తేరుకుని వెనుక ఉన్న సీట్లో ఉన్న అవనిని లేపడానికి ప్రయత్నిస్తే అంగుళం కూడా కదల్లేకపోయింది. వెన్నెముక దెబ్బతిందని సర్జరీ చేశారు. అవని ఇక జీవితంలో నడవలేదని.. నడుము కింది భాగం ట్రామాటిక్ పారాప్లీజియాకు గురైందని తెలిసి గుండెలు బద్ధలైపోయాయి" అని అవని తల్లి శ్వేత తెలిపారు.
'ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయా'
"ఇంటికెళ్లాక 'మళ్లీ నేను డ్యాన్స్ ఎప్పుడు చేస్తానమ్మా?' అని అవని అడిగిన ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. ఇక జీవితంలో నడవలేవని చెప్పడానికి ధైర్యం సరిపోలేదు. కానీ తప్పలేదు. కొన్నాళ్లు ఎవరితోనూ మాట్లాడేది కాదు. గదిలోనే ఒంటరిగా ఉండేది. ఒక్కోసారి ఆ బాధ.. కోపంగానూ మారేది. ఆ పరిస్థితి నుంచి బయటకు తీసుకురావడానికి తనలో ధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని నింపడం మొదలుపెట్టాను. ప్రమాదాలకు గురైనా అనుకున్న లక్ష్యాలను సాధించిన వారి కథలు చెప్పేదాన్ని. రెండేళ్లు తనే నా లోకమైంది. అమ్మలా అవసరాలను తీరుస్తూ టీచర్‌లా పాఠాలు బోధించేదాన్ని. స్నేహితురాలిలా మారి కబుర్లు చెబుతూ తనకు నీడలా మెలిగే దాన్ని. మళ్లీ మామూలు పరిస్థితికి తీసుకురావడానికి రెండేళ్లు పట్టింది. అవనికి చిన్నప్పుడు ఆటలంటే ఇష్టం. తిరిగి అదే రంగాన్ని తనకు పరిచయం చేద్దామనుకున్నా. ఓ సారి జగత్‌పురాలో సమ్మర్ క్యాంప్‌కు తీసుకెళ్లాం. అక్కడ రైఫిల్ షూటింగ్ తనని బాగా ఆకర్షించింది. కానీ ఒలింపియన్ అభినవ్ బింద్రా ఆత్మకథ చదివిన తర్వాతే తన జీవితం అద్భుతమైన మలుపు తిరిగింది. అతని స్ఫూర్తి కథ అవనిని రాష్ట్రస్థాయి పోటీల వరకూ చేర్చింది. తన కల మాత్రం పారాలింపిక్స్‌లో బంగారు పతకాన్ని అందుకోవాలనే. టోక్యోలో పాల్గొనడానికి అర్హత సాధించినప్పుడు తన ఆనందం మాటల్లో చెప్పలేను. అదే సమయానికి కరోనా వ్యాపించడంతో మా ఇంటికి ఫిజియోథెరపిస్టు రావడానికి కూడా వీలయ్యేది కాదు. అప్పుడు నేనే తనతో వ్యాయామాలు చేయించేదాన్ని. శిక్షణ కోసం ముంబయి వెళ్లడానికి వీల్లేక ఆన్‌లైన్‌లో చూసి సాధన చేసేది. తన జీవితంలో అనుకున్న ఏ గురినైనా తప్పదనే నమ్మకం నాకుంది. ఆ నమ్మకమే నిజమైంది. ఆనాడు జరిగిన ప్రమాద జ్ఞాపకాన్ని ఇప్పుడు తన విజయంతో మరిచిపోయేలా చేసింది" అని శ్వేత పేర్కొన్నారు.
'గర్వంగా ఉంది'
పారాలింపిక్స్‌లో అవని స్వర్ణం సాధించడం ఎంతో గర్వంగా ఉందని కోచ్ సుమ సిద్ధార్థ్ షిరుర్ అన్నారు.. అవని 16ఏళ్ల వయసుకే ఎన్నో పతకాలు సాధించిందని.. అయితే తన కల మాత్రం ఒలింపిక్స్ పతకమేనని పేర్కొన్నారు.
"అవనిని వాళ్ల నాన్న ప్రవీణ్ 2018లో నా వద్దకు తీసుకొచ్చారు. అప్పటికి తనకు 16 ఏళ్లుంటాయి. అప్పటికే ఎన్నో పతకాలు సాధించింది. కానీ తన కల మాత్రం ఒలింపిక్స్ పతకమే. సాధారణంగా ఉన్న వారితో పోలిస్తే తనకి శిక్షణ ఇవ్వడం నాకో సవాల్ అనిపించింది. అయిదు కేజీల రైఫిల్‌ను బ్యాలెన్స్ చేసేలా శారీరక సామర్థ్యాన్ని పెంచాలి. అందుకోసం చాలా పట్టుదలగా ఎంతోకష్టమైన వ్యాయామాలను చేసేది. డైట్ మార్చుకుంది. ఇలా ఎంతగానో సహకరించింది. నా దగ్గర శిక్షణ కోసం ఎంతో కష్టపడి రాజస్థాన్ నుంచి ముంబయికి.. రెండు వారాలకు లేదా నెలకోసారి వచ్చేది. టోక్యో పారాలింపిక్స్‌కు అర్హత సాధించిన తర్వాత సాధన సమయాన్ని బాగా పెంచింది. కొవిడ్ సమయంలో ముంబయి రావడం వీలుకాక ఇంట్లో నుంచే సాధన చేసేది. జూమ్‌లోనే శిక్షణనిచ్చా. తనపై తనకు నమ్మకం కుదిరింది. అది చూసి నాకూ సంతోషం అనిపించింది. అవని వైకల్యాన్ని జయించింది అనడంకన్నా ఆమె లక్ష్యం ముందు వైకల్యం ఏమీ చేయలేకపోయింది అంటేనే బాగుంటుంది."
- సుమ సిద్ధార్థ్ షిరుర్, శిక్షకురాలు
ఇదీ చూడండి: Tokyo Paralympics: గోల్డ్ మెడలిస్టులకు ఇండిగో బంపర్ ఆఫర్