Asian Wrestling Championships 2022: ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో అన్షు మలిక్ (57 కేజీలు), రాధిక (65 కేజీలు) చెరో రజతంతో సత్తాచాటారు. మనీష (62 కేజీలు) కాంస్యం సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలో దిగిన 20 ఏళ్ల అన్షు.. తుదిపోరులో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. శుక్రవారం ఫైనల్లో ఆమె.. సుగుమి సకురాయ్ (జపాన్) చేతిలో ఓడింది. గతేడాది 55 కేజీల విభాగంలో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన సకురాయ్‌తో ఇప్పుడీ పోరులో అన్షు తేలిపోయింది. ఆమెను మ్యాట్‌పై అదిమి పట్టి పైకి లేవకుండా పట్టు పట్టిన ప్రత్యర్థి స్వర్ణాన్ని ఎగరేసుకుపోయింది.
ఫైనల్ చేరే క్రమంలో అన్షు.. మూడు బౌట్లలోనూ సాంకేతిక ఆధిక్యత (ఏ దశలోనైనా ప్రత్యర్థిపై 10 పాయింట్ల ఆధిక్యం)తో గెలవడం విశేషం. ఆసియా ఛాంపియన్‌షిప్‌లో ఆమెకిది మూడో పతకం. 2020లో కాంస్యం గెలిచిన తను.. గతేడాది పసిడి నెగ్గింది. మరోవైపు నాలుగు బౌట్లకు గాను మూడింట్లో జయకేతనం ఎగరేసిన రాధిక వెండి పతకం దక్కించుకుంది. ఆమె విభాగంలో అయిదుగురు రెజ్లర్లు మాత్రమే పోటీపడ్డారు. ముగ్గురిని చిత్తుచేసిన తను.. స్వర్ణ విజేత మొరికావా (జపాన్) చేతిలో ఓడింది. ఇక కాంస్య పతక పోరులో మనీష.. హన్‌బిట్ లీ (కొరియా)ని చిత్తుచేసింది. ప్రత్యర్థిని మ్యాట్‌పై నుంచి పైకి లేవకుండా కట్టడి చేసి ఆమె విజయాన్ని అందుకుంది.
ఇదీ చూడండి: 14 ఏళ్లకే ఆసియా క్రీడలకు.. ఉన్నతి హుడా రికార్డు