All England Championships: భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్, యువ ఆటగాడు లక్ష్యసేన్ ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌పై గురిపెట్టారు. ప్రపంచ బ్యాడ్మింటన్‌లో అత్యంత పురాతన టోర్నీలో విజేతగా నిలిచి 21 ఏళ్ల భారత నిరీక్షణకు తెరదించాలని ఉవ్విళ్లూరుతున్నారు. 1980లో ప్రకాశ్ పదుకొణె, 2001లో పుల్లెల గోపీచంద్ ప్రతిష్టాత్మక టోర్నీలో ఛాంపియన్‌గా నిలిచారు. అప్పట్నుంచి ఆల్ ఇంగ్లాండ్ టైటిల్ భారత క్రీడాకారులకు అందని ద్రాక్షగానే మిగిలింది. ఒలింపిక్స్, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లతో సహా ఎన్నో ప్రతిష్టాత్మక సూపర్ సిరీస్‌లలో మెరిసిన సైనా నెహ్వాల్, సింధులకు ఆల్ ఇంగ్లాండ్ టైటిల్ ఊరిస్తూనే ఉంది. 2007 నుంచి 2021 వరకు 15 సార్లు ఈ టోర్నీలో బరిలో దిగిన సైనా.. 2015లో రన్నరప్‌గా నిలిచింది. ఫిట్‌నెస్, ఫామ్ ప్రకారం సైనాకు టైటిల్ గెలిచే అవకాశం లేకపోయినా ఈసారి కూడా ఆమె బరిలో ఉంది. ఇక 2012 నుంచి 2021 వరకు 9 మార్లు దండయాత్ర చేసిన సింధు.. 2018, 2021లలో సెమీస్ చేరుకోగలిగింది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో ఆకట్టుకున్న సింధు ఈసారి ఆల్ ఇంగ్లాండ్ టైటిల్ గెలవాలన్న పట్టుదలతో ఉంది. మహిళల సింగిల్స్ డ్రా ప్రకారం సింధు, సైనా ఒకే పార్శ్వంలో ఉన్నారు.
తొలి రౌండ్లో వాంగ్ జి (చైనా)తో ఆరో సీడ్ సింధు, పోర్న్‌పావీ (థాయ్‌లాండ్)తో సైనా తలపడనున్నారు. తొలి రౌండ్ అధిగమిస్తే ప్రిక్వార్టర్స్‌లో రెండో సీడ్ అకానె యమగూచి (జపాన్)తో సైనా, సయాక తకహాషి (జపాన్) లేదా సుపనిదా (థాయ్‌లాండ్)తో సింధు పోటీపడే అవకాశముంది. క్వార్టర్స్‌లో సింధుకు యమగూచి ఎదురవ్వొచ్చు. సెమీస్‌లో టోక్యో ఒలింపిక్స్ ఛాంపియన్ చెన్ యుఫెయ్ (చైనా), ఫైనల్లో టాప్ సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)లతో సింధుకు గట్టి పోటీ తప్పకపోవచ్చు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో కాంటాఫాన్ (థాయ్‌లాండ్)తో శ్రీకాంత్, సౌరభ్‌వర్మతో లక్ష్యసేన్, టాప్ సీడ్ విక్టర్ అక్సెల్సెన్ (డెన్మార్క్)తో సాయి ప్రణీత్, కున్లావుత్ (థాయ్‌లాండ్)తో ప్రణయ్, ఆంథోనీ జింటింగ్ (ఇండోనేసియా)తో పారుపల్లి కశ్యప్ తలపడతారు.
పురుషుల డబుల్స్‌లో అలెగ్జాండర్ డున్- ఆడమ్ హాల్ (స్కాట్లాండ్)తో సాత్విక్ సాయిరాజు- చిరాగ్‌శెట్టి, మార్క్ లాంఫస్- మెర్విన్ సిడెల్ (జర్మనీ)తో కృష్ణ ప్రసాద్- విష్ణువర్ధన్‌గౌడ్; మహిళల డబుల్స్ తొలి రౌండ్లో ఇవానగా- నకనిషి (జపాన్)తో సిక్కిరెడ్డి- అశ్విని పొన్నప్ప, రాచెల్- క్రిస్టెన్ (కెనడా)తో శ్రీవేద్య గురజాడ- ఇషిక; మిక్స్‌డ్ డబుల్స్‌లో హూ పాంగ్- యీ సీ (మలేసియా)తో వెంకట్ గౌరవ్ ప్రసాద్- జూహి తమ పోరాటాన్ని ప్రారంభించనున్నారు.
ఇదీ చదవండి: Kidambi Srikanth Special Interview: ఒలింపిక్స్ పతకమే లక్ష్యం: కిదాంబి శ్రీకాంత్