భారత ఏస్ ఆర్చర్ దీపిక కుమారీ... అంతర్జాతీయ వేదికపై సత్తా చాటింది. బ్యాంకాక్ వేదికగా జరిగిన ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్.. మహిళల రికర్వ్ ఈవెంట్ విభాగంలో పసిడి సొంతం చేసుకుంది. గురువారం జరిగిన ఫైనల్లో మరో భారత క్రీడాకారిణి అంకితపై 6-0 తేడాతో గెలుపొందింది. పతకంతో పాటు ఒలింపిక్స్‌కు ఈ కోటాలో బెర్త్ సంపాదించుకొంది. అంకిత రజతంతో సరిపెట్టుకుంది.
ఇదే టోర్నీలో ఇటీవల రికర్వ్ మిక్స్‌డ్ పెయిర్ ఈవెంట్లో దీపిక, పురుష ఆర్చర్ అతన్ దాస్ కలిసి కాంస్యం గెలుచుకుంది. ఆ పోటీలో చైనాకు చెందిన యిచాయ్ జెంగ్, షోక్సన్ వే ద్వయాన్ని 6-2 తేడాతో ఓడించారు.
తెలుగమ్మాయిదే తొలి స్వర్ణం...
ఇప్పటివరకు ఈ టోర్నీలో కాంపౌండ్ మిక్స్‌డ్ విభాగంలో స్వర్ణం గెలిచింది తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మాత్రమే. ఈ క్రీడాకారిణి మరో పురుష ఆటగాడు అభిషేక్ వర్మతో కలిసి పతకం నెగ్గింది.
భారత ఆర్చరీ సమాఖ్య మీద నిషేధం కారణంగా స్వతంత్ర క్రీడాకారులుగా బరిలో దిగిన భారత ఆర్చర్లు... మొత్తం తొమ్మది పతకాలు(రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, నాలుగు కాంస్యాలు) సాధించారు. నేటితో టోర్నీ ముగియనుంది.