హత్య కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్‌పై భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) స్పందించింది. ఈ పరిణామం భారత రెజ్లింగ్ ప్రతిష్ఠను దెబ్బతీసిందని పేర్కొంది. టోక్యో ఒలింపిక్స్‌కు ఈ సారి ఏకంగా 8 మంది అర్హత సాధించారు. ఈ ఆనంద సమయంలో సుశీల్ సంఘటన.. భారత రెజ్లింగ్‌కు మాయని మచ్చలాగా మారిందని డబ్ల్యూఎఫ్ఐ వెల్లడించింది.
“సుశీల్ సంఘటన భారత రెజ్లింగ్ సమాఖ్య ప్రతిష్ఠను దెబ్బతీసింది. వారు బయట చేసే పనులతో మాకు ఎటువంటి సంబంధం లేదు. అతని భవిష్యత్‌పై ఆందోళన చెందుతున్నాము. దీంతో పాటు ఫిబ్రవరిలో జరిగిన ఘటనతోనూ సమాఖ్య ప్రతిష్ఠ దిగజారిందని చెప్పొచ్చు. సమాజం ఇకపై రెజ్లర్లను గూండాలుగా భావిస్తుంది.”
-వినోద్ తోమర్, భారత రెజ్లింగ్ సమాఖ్య కార్యదర్శి.
హరియాణా రోహ్తక్ జిల్లాలోని జాట్ జిల్లాలో కోచ్ మనోజ్ మాలిక్‌తో సహా ఐదుగురి హత్య కేసులో రెజ్లింగ్ కోచ్ సుఖ్వీందర్ సింగ్ ప్రమేయముందని తేలింది. వ్యక్తిగత కక్ష్యతోనే వారిని అంతమొందిచినట్టు విచారణలో తెలిసింది. ఈ రెండు ఘటనలతో రెజ్లింగ్ ప్రతిష్ఠకు దెబ్బ పడిందని డబ్ల్యూఎఫ్ఐ కార్యదర్శి తెలిపారు.
దిల్లీలోని ఛత్రశాల్ స్టేడియంలో మే 4న జరిగిన గొడవలో రెజ్లర్ సుశీల్ కుమార్ ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడుల్లో సాగర్ రానా అనే 23 ఏళ్ల మల్లయోధుడు ప్రాణాలొదిలాడు. అప్పటి నుంచి సుశీల్ జాడ కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఇక లాభం లేదని భావించిన పోలీసులు.. ఏకంగా సుశీల్ కోసం లుక్ ఔట్ నోటీస్ జారీ చేశారు.
సుశీల్ అంతర్జాతీయ కెరీర్ భారత్‌లో పలువురికి ఆదర్శంగా నిలిచింది. చాలా మంది అతని ప్రేరణతో రెజ్లింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నారు. పల్లెటూరి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన అతని నేపథ్యం స్ఫూర్తిదాయకం. ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన ఏకైక రెజ్లర్ సుశీల్. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి.. రెజ్లింగ్‌లో 56 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు. అతన్ని ఆదర్శంగా తీసుకొని తర్వాతి రోజుల్లో యోగేశ్వర్ దత్, గీత, బబిత ఫోగట్, వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, భజరంగ్ పూనియా, రవి దహియా, దీపక్ పూనియా వంటి రెజ్లర్లు వచ్చారు.
వార్షిక కాంట్రాక్ట్ నుంచి తప్పిస్తుందా?
డబ్ల్యూఎఫ్ఐ ప్రకారం సుశీల్ ప్రస్తుతం ఏ గ్రేడ్ కాంట్రాక్ట్‌లో ఉన్నాడు. అతనికి ఏడాదికి రూ.30 లక్షలు జీతంగా లభిస్తుంది. అయితే ఈ కాంట్రాక్ట్ నుంచి సుశీల్‌ను తప్పించే అవకాశం ఉందా అని అడిగిన ప్రశ్నకు.. అలాంటిదేమీ లేదని తెలిపారు వినోద్ తోమర్.
ఇదీ చదవండి: 'మిగిలిన ఐపీఎల్ మ్యాచ్‌ల్లో మా ఆటగాళ్లు ఆడకపోవచ్చు!'