Asian Champions Trophy Hockey 2021: ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీలో టైటిల్ గెలవాలనుకున్న భారత్ ఆశలకు కరోనా గండికొట్టింది. ఓ సభ్యురాలికి పాజిటివ్‌గా తేలడం వల్ల మన జట్టు టోర్నీ మధ్యలోనే పోటీల నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో భారత్ 13-0తో థాయ్‌లాండ్‌ను చిత్తు చేసింది. ఆ తర్వాత మలేసియాతో పోటీపడాల్సి ఉండగా.. ఆ జట్టులోని ఇద్దరు క్రీడాకారిణులకు కరోనా నిర్ధరణ కావడం వల్ల ఆ మ్యాచ్‌ను నిర్వహించలేదు. మలేసియా టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఇక భారత్ బుధవారం కొరియాను ఢీకొనాల్సివుండగా ఆ మ్యాచ్‌ను నిర్వాహకులు వాయిదా వేశారు. మ్యాచ్‌కు ముందు పరీక్షల్లో జట్టులోని ఒకరికి పాజిటివ్‌గా రావడమే కారణం. గురువారం చైనాతో మ్యాచ్‌ను నిర్వహించలేదు.
"జట్టులోని సభ్యురాలికి కరోనాగా నిర్ధారణ కావడం వల్ల గత టోర్నీ రన్నరప్ భారత్ టోర్నీ నుంచి వైదొలగక తప్పలేదు" అని ఆసియా హాకీ సమాఖ్య తెలిపింది. భారత జట్టులో కరోనా వచ్చింది ఎవరికి అనేది వెల్లడించలేదు. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ప్రకారం 2020లోనే జరగాల్సి ఉండగా.. కరోనా కారణంగా ఈ ఏడాదికి వాయిదా వేశారు. ఈ టోర్నీలో మెరుగైన ర్యాంకింగ్ కలిగిన జట్టు భారతే. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత మహిళల జట్టు తొమ్మిదో స్థానంలో ఉంది.